‘పునరావసం’లో ఆక్రమణలు!
● ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లోని ఖాళీ ప్లాట్లు కబ్జా ● పట్టించుకోని అధికారులు
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు పునరావాస కాలనీల్లోని ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో సరిహద్దులు దాటేస్తున్నారు. ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో మిగులు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. గతంలో అధికారులు హద్దులు చూపినా ఆనవాళ్లు లేకుండా పోయాయి. మూడేళ్ల క్రితం ఆర్‌అండ్‌ఆర్ ప్లాట్ల క్రయ, విక్రయాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో స్థలాల ఆక్రమణలు పెరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.
12 గ్రామాలు.. 11,731 మంది నిర్వాసితులు
మిడ్‌మానేరు నిర్మాణంలో బోయినపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల పరిధిలో 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 11,731 మంది ని ర్వాసితులు ఉన్నారు. ఒక్కో నిర్వాసితునికి 242 చ దరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం పట్టాగా అందజేసింది. నిర్వాసితుల ఇళ్ల స్థలాలకు, కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్స్ వంటి మౌలిక వసతుల కల్పనకు స్థలాలు గుర్తించింది. బోయినపల్లి, తంగళ్లపల్లి, వే ములవాడ మండలాల పరిధిలోని 12 ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయించా రు. మిగిలిన ప్లాట్లు 1,213 ఉన్నట్లు సమాచారం.
ఆక్రమిత స్థలాల్లో పంటల సాగు
మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణంతోపాటు ముంపు గ్రామాల స్థానంలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీల నిర్మాణాలకు ప్రభుత్వం సుమారు 40వేల ఎకరాల భూమి సేకరించిందని సర్వే అధికారులు చెబుతున్నారు. ఇందులో నుంచి సుమారు వేయి ఎకరాలకు పైగా స్థలాలు ఆక్రమణలకు గురైనట్లు సమాచారం. ఖాళీ ప్లాట్లలో పత్తి తదితర పంటలు సాగుచేస్తున్నట్లు తెలిసింది. నీలోజిపల్లికాలనీ రోడ్డు పరిసరాల్లో సుమారు 8 గుంటలు, పాఠశాల పరిసరాల్లో ఒకరు 4 గుంటలు స్థలం ఆక్రమించుకున్నట్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. కొదురుపాకకాలనీలో బీ సైడ్, ఏ సైడ్ పలు ప్లాట్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. గతంలో వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, రుద్రవరం కాలనీల్లో ప్రైవేటు వెంచర్ల రియల్ దందా సాగినా పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. ఆక్రమణదారులను పలువురు సర్వే పేరుతో బెదిరించి దండుకున్నట్లు సమాచారం. గతంలో అధికారులు ఆక్రమణలను స్వాధీనం చేసుకోకపోవడంతో యథావిధిగా సాగు చేసుకుంటున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో మిగిలిన స్థలాల్లో పలు చోట్ల స్థలాల ఆక్రమణలు జరుగుతున్నాయి. హద్దులు చెరిపేసి ఆక్రమించుకుంటున్నారు. అధికారులు ఆక్రమణలను గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఆర్‌అండ్‌ఆర్ కాలనీల చుట్టూ హద్దులు ఏర్పాటు చేయాలి. ఖాళీ ప్లాట్లలో పంటలు వేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి.
– సింగిరెడ్డి బాలమల్లు, నీలోజిపల్లి
‘పునరావసం’లో ఆక్రమణలు!
‘పునరావసం’లో ఆక్రమణలు!


