● అందని టార్పాలిన్లు ● ఏడేళ్లుగా నిలిచిన సబ్సిడీపై సరఫర
సిరిసిల్ల: వడ్లు ఆరబోసుకునేందుకు 50 శాతం సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు(తాటిపత్రాలు) ప్రభుత్వం సరఫరా చేసేది. ఏడేళ్లుగా టార్పాలిన్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో వడ్లను ఆరబెట్టుకునేందుకు అన్నదాతల అవస్థలు అన్నీ..ఇన్నీ కావు. పరదాలను అద్దెకు తెచ్చుకొని వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా భారీ వర్షాలకు ఆ పరదాలు తడిసి వడ్లు ముద్దవుతున్నాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు పడుతున్న కష్టాలు చెప్పలేనివిగా ఉన్నాయి.
50 శాతం సబ్సిడీపై..
గతంలో ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్లను పంపిణీ చేసేది. 250 జీఎస్‌ఎం(మందం) గల నాణ్యమైన 8 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఉన్న వాటిని సబ్సిడీపై రూ.1250కి అందించే వారు. అనంతర కాలంలో ఈ పథకాన్ని ఉద్యానశాఖ నుంచి వ్యవసాయ శాఖకు బదిలీ చేశారు. 2017–2018 ఆర్థిక సంవత్సరం వరకు సబ్సిడీపై టార్పాలిన్లు అందించారు. ఆ తర్వాత నిలిపివేశారు. దీంతో రైతులు సొంతంగా ఒక్కో టార్పాలిన్‌ను రూ.3500లకు కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 1,84,860 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా.. ఈ సీజన్‌లో 3.45 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇంత పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి అవుతున్న తరుణంలో రైతులకు తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా వ్యవసాయ పరికరాలను సబ్సిడీ గతంలో మాదిరి అందిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయలేదు.
కల్లాల ఆశలు కల్లలు
జిల్లాలో ఉపాధిహామీలో పొలాల వద్ద కల్లాల నిర్మాణాలకు 2020–2021 ఆర్థిక సంవత్సరంలో రూ.14.03 కోట్లు కేటాయించారు. ఒక్కో మండలానికి 200.. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 2,600 కల్లాల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. రైతులు ముందుకురాలేదు. జిల్లాలో 50 శాతం కూడా కల్లాల నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇటు కల్లాలు అందుబాటులోకి రాక.. అటు టార్పాలిన్లు లేక రైతులు వర్షాకాలం పంటను ఆరబెట్టేందుకు అవస్థలు పడుతున్నారు.
వడ్లను నేర్పుతున్న ఇతను రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బిలవేణి గంగ మల్లయ్య. నాలుగు ఎకరాల్లో వరి వేశాడు. పది రోజుల కిందట వడ్లను రుద్రంగి వ్యవసాయ మార్కెట్‌యార్డులో పోశాడు. మార్కెటింగ్ అధికారులు టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో బుధవారం కురిసిన వర్షానికి వడ్లు తడిసిపోయాయి.
● అందని టార్పాలిన్లు ● ఏడేళ్లుగా నిలిచిన సబ్సిడీపై సరఫర


