బాబోయ్ కుక్కలు
గ్రామాల్లో పెరుగుతున్న కుక్కల బెడద
గాయాల పాలవుతున్న ప్రజలు
కోనరావుపేట(వేములవాడ): జిల్లాలో కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. బైక్‌లపై వెళ్తున్న వారిని వెంబడించి మరీ కరుస్తున్నాయి. రోడ్లపైనే పడుకుంటున్న వీధికుక్కలతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. కొన్ని నెలలుగా కుక్కకాటు బాధితులు పెరుగుతున్నారు. కుక్కల స్వైరవిహారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
కనిపించని నివారణ చర్యలు
జిల్లాలో కుక్కల నివారణ చర్యలు తీసుకున్నట్లు దాఖలాలు లేవు. గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో విద్యార్థులు స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్లేందుకు జంకుతున్నారు. ఒంటరిగా వెళ్లే వారిపై గుంపులుగా దాడి చేస్తుండడంతో ఏమి చేయలేకపోతున్నారు. కోనరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. పట్టణాలకు దగ్గరగా, కోనరావుపేటకు దూరంగా ఉన్న గ్రామీణులు సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలకు వెళ్లి వైద్యసేవలు పొందుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతీ నెల సరాసరిగా 40 నుంచి 50 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. వీటితోపాటు సిరిసిల్ల, వేములవాడ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకునే వారి సంఖ్య అదనం. జిల్లాలో ఆగస్టు 470 మంది కుక్కకాటుకు గురయ్యారని సమాచారం. సెప్టెంబర్ 390 మంది, అక్టోబర్‌లో 420 మందికి పైగానే కుక్కకాటు బాధితులు ఉన్నట్లు తెలిసింది. వీరంతా జిల్లాలోని ఆయా పీహెచ్‌సీలలో చికిత్స పొందారు.


