చకచకా ఈ–కేవైసీ
గంభీరావుపేట(సిరిసిల్ల): గ్రామాల్లో వలసల నివారణకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలకు దిగింది. అసలైన అర్హులకు ఏడాదిలో వంద రోజులు పనికల్పించి.. ఉన్న ఊరిలోనే జీవించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకంలో ఉన్న కొన్ని లొసుగులను క్షేత్రస్థాయిలోని సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నట్లు కొన్ని సందర్భాల్లో తేలింది. వీరి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం జాబ్‌కార్డు ఉన్న కూలీల ఈ–కేవైసీ చేస్తున్నారు. దీని ద్వారా నిజమైన కూలీలే పనికి వచ్చి లబ్ధి పొందుతారు.
సామాజిక తనిఖీల్లో వెలుగులోకి..
ఉపాధిహామీ జరిగేటప్పుడు ఈజీఎస్ సిబ్బంది కూలీల ఫొటోలు తీసి నేషనల్ మానిటరింగ్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. కొన్ని చోట్ల నకిలీల ఫొటోలు అప్‌లోడ్ చేసినట్లు వెలుగుచూసింది. ఉపాధిహామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు పనులకు వెళ్లడం, పనులు చేయకుండానే వేతనాలు పొందడం వంటి తప్పిదాలు గతంలో సామాజిక తనిఖీల్లో వెల్లడయ్యాయి. చాలా గ్రామాల్లో అధికా రులు, సిబ్బంది తమ బంధువులు, ప్రజాప్రతినిధుల బంధువులు ఉపాధిహామీ పనులు చేసినట్లు మస్టర్లలో తప్పుడుగా రికార్డు చేసినట్లు తేలింది.
ఈ–కేవైసీతో నకిలీలకు చెక్
ఉపాధిహామీలో నకిలీ కూలీలకు చెక్ చెట్టేందుకు ప్రభుత్వం ఈ–కేవైసీ ప్రక్రియను చేపట్టింది. ఈ విధానంలో భాగంగా యాప్‌లో కూలీల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేస్తున్నారు. పనులు చేసే సమయంలో తీసే ఫొటో ప్రస్తుతం తీస్తున్న ఫొటోకు సరిపోతేనే హాజరుపడనుంది. అప్పుడే వేతనాలు జమకానున్నాయి. జిల్లాలో ఈ ప్రక్రియ ఇప్పటికే 90శాతం పూర్తయింది. అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీల ఈ–కేవైసీ ప్రక్రియను చేస్తున్నారు. వందశాతం కూలీల ఈ–కేవైసీ కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ–కేవైసీలో భాగంగా మృతులు, శాశ్వతంగా వలసవెళ్లిన వారి పేర్లను తొలగించాలని అధికారులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ తర్వాతే పేర్లు తొలగించాలని కూలీలు కోరుతున్నారు.
ఉపాధిహామీ సమాచారం
గ్రామాలు 260
జాబ్‌కార్డులు 98,133
కూలీలు 1,99,721


