శిక్షణ దూరమై.. నైపుణ్యం కరువై
● సిరిసిల్లలో మూతపడ్డ పవర్‌లూమ్ శిక్షణ కేంద్రం ● శిక్షణ లేక.. కార్మికులు దొరక్క ● నైపుణ్య కార్మికుల కొరతతో ఇబ్బంది ● నేడు చేనేత, జౌళిశాఖ కమిషనర్ రాక ● మహిళాశక్తి చీరల ఉత్పత్తిపై సమీక్ష
సిరిసిల్ల: స్థానిక యువతకు పవర్‌లూమ్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం పదేళ్లుగా మూతపడింది. శిక్షణ తరగతులు లేక నైపుణ్యం గల కార్మికుల కొరత ఏర్పడింది. 2005లో పవర్‌లూమ్ శిక్షణ కేంద్రాన్ని బద్దెనపల్లి టెక్స్‌టైల్ పార్క్‌లో ప్రారంభించారు. పదోతరగతి చదువుకున్న యువకులకు ఆ సమయంలో ప్రతీ నెల రూ.1000 ఉపకార వేతనం ఇస్తూ ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చే వారు. శిక్షణ పొందిన యువకులు స్థానికంగా టెక్స్‌టైల్ పార్క్‌లోని ఆధునిక ర్యాపియర్ లూమ్స్, సిరిసిల్లలోని పవర్‌లూమ్స్ నడిపే శిక్షణ పొందేవారు. ఏడేళ్ల పాటు ఓ వెయ్యి మందికి శిక్షణ ఇచ్చారు. 2015 నుంచి టెక్స్‌టైల్ పార్క్‌లోని పవర్‌లూమ్ శిక్షణ కేంద్రం మూతపడింది. అప్పటి నుంచి యువతకు శిక్షణ లేక.. సాంచాలు నడిపే నైపుణ్యం గల కార్మికుల కొరత ఏర్పడింది.
ఉపకార వేతనం అసలు సమస్య
ప్రభుత్వం ఇచ్చే రూ.వెయ్యి ఖర్చులకు సరిపోక.. సిరిసిల్ల నుంచి టెక్స్‌టైల్ పార్క్ వరకు వెళ్లి రావడం ఇబ్బందిగా మారడంతో శిక్షణ పొందేందుకు యువత ముందుకు రాలేదు. దీంతో శిక్షణ కేంద్రం మూతపడింది. చేనేత, జౌళిశాఖ అధికారులు 2017లో రూ.5వేల ఉపకార వేతనం ఇవ్వాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి పంపించగా.. ఆ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేయడంతో పవర్‌లూమ్స్ శిక్షణ కేంద్రం మూతపడింది. అయితే శిక్షణ కేంద్రంలోని సిబ్బంది మాత్రం ఖాళీగా కూర్చుంటూ జీతాలు పొందుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.8వేల ఉపకార వేతనం ఇస్తూ ఆరు నెలలపాటు ఆధునిక మగ్గాలపై, సిరిసిల్లలోని సాంచాలపై బట్టను ఉత్పత్తి చేసే విధంగా శిక్షణ ఇస్తే వస్త్రపరిశ్రమకు నైపుణ్యం గల కార్మికులు లభిస్తారు. ఇప్పటికై నా జౌళిశాఖ ఉన్నతాధికారులు పవర్‌లూమ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తే యువకుల ఉపాధికి ఊతమిచ్చినట్లు అవుతుంది.
శిక్షణ ఇస్తేనే ఉపాధి రక్షణ
సిరిసిల్లలో కాలం చెల్లిన మగ్గాలను నడుపుతూ మార్కెట్‌లో డిమాండ్ లేని పాలిస్టర్ బట్టను ఉత్పత్తి చేస్తూ వస్త్రపరిశ్రమ తరచూ సంక్షోభానికి గురవుతుంది. నాణ్యమైన నూలుతో బట్టను తయారు చేస్తే.. మార్కెట్‌లో ఎలాంటి ఇబ్బంది లేదు. సాంచాలు నడిపే కార్మికుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం పవర్‌లూమ్ శిక్షణ కేంద్రాన్ని మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఆ శిక్షణతోనే సిరిసిల్ల పరిశ్రమకు రక్షణ ఉంటుంది. ఉత్తరాది కార్మికులతో సిరిసిల్లలో ఇప్పుడు వస్త్రపరిశ్రమ మనుగడ సాగిస్తున్నా.. భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక యువతకు శిక్షణనిస్తే ఉపాధికి రక్షణ లభిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నేడు సిరిసిల్లకు చేనేత, జౌళిశాఖ కమిషనర్
రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్ మంగళవారం సిరిసిల్లకు వస్తున్నారు. స్థానిక వస్త్రపరిశ్రమకు 4.24 కోట్ల మీటర్ల మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లను ప్రభుత్వం అందించగా.. ఇప్పటి వరకు 50 లక్షల మీటర్లు మాత్రమే ఉత్పత్తి అయింది. 26వేల మరమగ్గాలు ఉండగా.. 5,600 సాంచాలపైనే చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. నిత్యం లక్షా 50వేల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి కావాల్సి ఉండగా.. కేవలం 35వేల మీటర్లు ఉత్పత్తి అవుతుంది. మహిళాశక్తి చీరల బట్ట ఉత్పత్తిలో వేగాన్ని పెంచేలా వస్త్రోత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు జౌళిశాఖ కమిషనర్ సిరిసిల్లకు వస్తున్నారు.
శిక్షణ దూరమై.. నైపుణ్యం కరువై


