
ఉగ్రవాద మూలాలు లేకుండా చూడాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): దేశంలో ఉగ్రవాద మూలాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఇల్లంతకుంటలో జరుగుతున్న పెద్దమ్మ పండుగ ఉత్సవాల్లో ఆదివారం పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం పాకిస్థాన్‌తో పోరాటం చేసి బంగ్లాదేశ్ విముక్తికి సహకరించిందని గుర్తు చేశారు. ముదిరాజ్ సంఘం నాయకులు గొడుగు నర్సయ్య, పిల్లి వెంకటి, కూనబోయిన బాలరాజు, సుధాకర్, రఘు, రమేశ్, కనకయ్య, రేగుల కార్తీక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, వెంకట రమణారెడ్డి, పసుల వెంకటి పాల్గొన్నారు.
పున్నం చందర్‌కు బెస్ట్ సైకాలజిస్ట్ అవార్డు
సిరిసిల్లటౌన్: ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ ‘బెస్ట్ సైకాలజిస్ట్ అవార్డ్–2025’ అందుకున్నారు. హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం చేతుల మీదుగా అందుకున్నారు. మానసిక ఆరోగ్యంపై అంకితభావంతో పనిచేస్తూ ఆత్మహత్యల నివారణకు కృషి చేసినందుకు ఈ పురస్కారం అందజేశారు. తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోతుకూరి రామ్‌చందర్ మాట్లాడుతూ పున్నంచందర్ పదిహేనేళ్లుగా మానసిక సమస్యల పరిష్కారానికి నూతన పద్ధతులను వినియోగిస్తూ, వ్యక్తిగత కౌన్సెలింగ్, వర్క్‌షాపులతో అనేక మందికి స్ఫూర్తిగా నిలి చారని కొనియాడారు. అవార్డు రావడంపై సైకాలజిస్ట్‌లు ఆంజనేయులు, ఈశ్వర్, శ్రీనివాస్, అయ్యప్ప రాము, తిరుమల అభినందించారు.
అంతర్జాతీయ పోటీలకు చెక్కపల్లి యువకుడు
వేములవాడరూరల్: అంతర్జాతీయ సెస్టోబాల్ పోటీలకు వేములవాడరూరల్ మండలం చెక్కపల్లికి చెందిన ఎడపెల్లి అనిల్ ఎంపికయ్యారు. ఈనెల 16 నుంచి 19 వరకు శ్రీలంకలో జరిగే రెండో సౌత్ ఏషియన్ సెస్టోబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొననున్నారు. తెలంగాణకు చెందిన ఆరుగురు ఆటగాళ్లు భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అనిల్‌ను గ్రామస్తులు ఆదివారం సన్మానించారు. నాయకులు వంగపల్లి మల్లేశం, బాలసాని శ్రీనివాస్, చిలుక ప్రభాకర్, అడ్డికే జైపాల్‌రెడ్డి, నరేశ్, హరినందన్‌రెడ్డి, అశీల శేఖర్, రమణారెడ్డి, దాన వేణు, నాగరాజు పాల్గొన్నారు.
వేములవాడ సబ్ రిజిస్ట్రార్ బదిలీ
వేములవాడ: సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న రాజిరెడ్డి మంచిర్యాలకు బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.

ఉగ్రవాద మూలాలు లేకుండా చూడాలి

ఉగ్రవాద మూలాలు లేకుండా చూడాలి