
నేతన్నల ఖాతాల్లో యారన్ సబ్సిడీ
● 3,019 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.5.24 కోట్లు ● 2023 నాటి బతుకమ్మ చీరల సొమ్ము జమ
సిరిసిల్ల: స్థానిక వస్త్రపరిశ్రమలో 2023లో బతుకమ్మ చీరలు నేసిన కార్మికులకు 10శాతం యారన్ సబ్సిడీ డబ్బులను చేనేత, జౌళిశాఖ అధికారులు విడుదల చేశారు. 3,019 మంది పవర్‌లూమ్ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.5.24కోట్లు జమ చేశారు. మొదటి విడతగా 3,019 మందికి డబ్బులు వస్తాయని, రెండో విడతలో మరో 1,481 మంది ఖాతాల్లో జమవుతాయని అధికారులు తెలిపారు. సిరిసిల్లలో పవర్‌లూమ్ కార్మికులకు మెరుగైన కూలీ(పగార్) అందించేందుకు 2019లో పది శాతం యారన్ సబ్సిడీని పథకాన్ని అమలు చేశారు. సాంచాలపై కార్మికుడు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బట్ట ఆధారంగా ఒక్కో మీటరుకు కూలీపై అదనంగా రూ.1.42 చొప్పున చెల్లిస్తారు. ఎన్ని మీటర్ల బట్టను ఉత్పత్తి చేస్తే అన్ని డబ్బులను చేనేత, జౌళిశాఖ అధికారులు కార్మికుడి బ్యాంకు ఖాతా లో జమచేస్తారు. ఒక్కో కార్మికుడికి రూ.10 వేల నుంచి రూ.24 వేల వరకు జమయ్యాయి.