
తుప్పు పడుతున్నాయి
ఇది ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో
సీజ్ చేసిన ట్రాక్టర్. ఠాణాలో స్థలాభావంతో బయ ట నిలుపుతున్నారు. పట్టుకున్న పెద్ద వాహనాల
(లారీలు, ట్రాక్టర్లు, జీపులు)ను ఇలా ఠాణా బయట ఉంచుతున్నారు. వీటిపై పోలీసులు నిఘా పెట్టకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు వాటి భాగాలను ఎత్తుకెళ్తున్నారు. దీంతో రికవరీ చేసుకునే సమయంలో అన్ని పార్టులు లేక వాహనదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పటికే కోర్టు ద్వారా అనుమతులు పొందడ ఆలస్యం కావడం, మళ్లీ కొత్త పార్ట్స్ కొనడం ఇబ్బందిగా మారుతుంది.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో వివిధ సందర్భాల్లో పట్టుబడ్డ వాహనాలు ఠాణాల్లోనే తుప్పుపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లోని పోలీస్‌స్టేషన్లలో పట్టుబడ్డ వాహనాలు 550 వరకు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం, కలప రవాణా, నాటుసారా తరలింపు, సరైన ధ్రువీకరణపత్రాలు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. కేసు విషయంలో కోర్టు వరకు పోవడం.. అక్కడ తీర్పు వచ్చే వరకు జాప్యమవుతుండడంతో ఠాణాల్లోనే వాహనాలు పాడవుతున్నాయి. కొన్ని ఠాణాల్లోని ఆవరణలో స్థలం లేక సీజ్ చేసిన వాహనాలను బయట మైదానంలో నిలుపుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాల బ్యాటరీలు, టైర్లు, ఇతర విడిభాగాలను ఎత్తుకెళ్తున్నారు. పట్టుకున్న వాహనాలపై పోలీసుల నిఘా లేకపోవడంతో విడిభాగాలు మాయమవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జరిమానాలు.. ఆపై పార్ట్స్ మాయం
వాహనాలు పట్టుబడ్డ సమయంలో పోలీసులు కేసు నమోదు చేస్తుండడంతో బాధితులు కోర్టుకు వెళ్తున్నారు. అక్కడ జరిమానాలు చెల్లిస్తూ తమ వాహనాలను విడిపించుకుంటున్నారు. ఇదే సమయంలో ఠాణా పరిధిలో ఉన్న కొన్ని వాహనాల పార్ట్స్ మాయమవుతుండడంపై వాహన యజ మానులు ఆందోళన చెందుతున్నారు. కొత్తవి కొనేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని వాహన యజమానులు పేర్కొంటున్నారు.
ఏళ్లుగా ఠాణాల్లోనే వాహనాలు
వివిధ కేసుల్లో పట్టుబడుతున్న వాహనాలను కొందరు యజమానులు తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. సారాయి తరలింపు, ప్రమాదాలు జరిగిన సమయంలో తుక్కుతుక్కయిన వాహనాలను రికవరీ చేసేందుకు వాహన యజమానులు ముందుకురావడం లేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా 550 వాహనాలు ఠాణాల్లోనే ఉంటున్నాయి. కొన్ని వాహనాలు తుప్పుపట్టి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి.
కేవలం ఎకై ్సజ్‌శాఖలో పట్టుబడ్డ వాహనాలను మాత్రమే అప్పుడప్పుడు వేలం వేస్తున్నారు. పోలీస్ అధికారులు పట్టుకున్న వాహనాలను వేలం వేయడం లేదు. పోలీస్ అధికారులు ముందుకొచ్చి వేలం వేసినా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుందనే పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఠాణాల్లోనే వాహనాలు
పట్టుకున్న వాహనాలపై నజర్ కరువు
మాయమవుతున్న పార్ట్స్
ఆందోళనలో వాహనదారులు
జిల్లాలో పట్టుబడ్డ వాహనాలు 550

తుప్పు పడుతున్నాయి

తుప్పు పడుతున్నాయి