
రాహుల్ ఆలోచనే సకల కులగణన
సిరిసిల్లటౌన్: భారత్ జోడోయాత్ర ద్వారా రాహుల్‌గాంధీ సంకల్పించిన జనగణనలో కులగణన ఆలోచన విధానమే దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని టీపీసీసీ పరిశీలకుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంంలో మాట్లాడారు. కులగణనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక, రాజకీయ, ఆర్థికంగా న్యాయం జనగణన ద్వారా కులగణన చేపట్టడంతో సాధ్యమైతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో కులగణన పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎం.డి. హమీద్, వెంగళ అశోక్, నేరెళ్ల శ్రీకాంత్, నీలి రవిందర్, గుజ్జె రమేష్, అడ్డగట్ల శంకర్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
మందుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత
సిరిసిల్ల: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆరోగ్య ఉపకేంద్రాల్లో అందుబాటులో ఉన్న మందుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత కోరారు. పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని, చీర్లవంచ ఆరోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్‌సీడీ, టీబీ, ఆయుష్మాన్ భారత్ లక్ష్యాలు సాధించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆమె కోరారు. ఆస్పత్రి రికార్డులను ఆమె తనిఖీ చేశారు. ఆమె వెంట సీహెచ్‌వో బాలచంద్రం, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
తంగళ్లపల్లి: జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ నగర్ పీహెచ్‌సీ, చీర్లవంచ పీహెచ్‌సీ పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాలను తనిఖీ చేశారు. రికార్డులు, మందులు పరిశీలించి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. సీహెచ్‌వో బాలచంద్రం, సిబ్బంది పాల్గొన్నారు.
కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా చట్టాలు
బోయినపల్లి: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలు ఎత్తివేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పేర్కొన్నారు. మండలంలోని కొదురుపాక హైస్కూల్ మైదానంలో శుక్రవారం సీపీఐ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా చట్టాలు రూపొందిస్తూ కార్మికుల పొట్ట గొడుతున్నారని ఆరోపించారు. ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతీ కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మీసం లక్ష్మణ్, మండల కార్యదర్శి లింగాల వెంకటి, కొండ నాగరాజు, కొత్తూరు నర్సయ్య, ఎల్లయ్య, కొమురవ్వ, మల్లయ్య, శంకరయ్య, అంజయ్య, వీరయ్య, పూజ, పోచయ్య, వెంకయ్య, దుర్గయ్య, రాధ తదితరులు పాల్గొన్నారు.
సివిల్స్‌లో ఉచిత శిక్షణ
సిరిసిల్లకల్చరల్: రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అర్హులైన వందమంది యువతకు సివిల్స్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి ఎం. ఏ భారతి ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల సంబంధిత వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 24లోపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 040–23236112 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

రాహుల్ ఆలోచనే సకల కులగణన