కార్మికసంఘాలతో అధికారుల చర్చలు విఫలం
● శ్రీరామనవమి తరువాత సంయుక్త చర్చలు
సిరిసిల్ల: పవర్‌లూమ్ కార్మికసంఘాల నాయకులతో చేనేత, జౌళిశాఖ, కార్మిక శాఖ అధికారులు శుక్రవారం చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. నాలుగు రోజులుగా సిరిసిల్లలో నేతకార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మిక నాయకులతో అధికారులు కలెక్టరేట్‌లో చర్చలు నిర్వహించారు. పాలిస్టర్ వస్త్రోత్పత్తిలో 2018 నాటి పాతకూలీని ఇస్తున్నారని, కొత్త కూలీ ఒప్పందం చేసుకోకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని కార్మికసంఘాల నాయకులు వివరించారు.పాతకూలీతో కార్మికులు నష్టపోతున్నారని, 2023 నాటి బతుకమ్మ చీరలకు సంబంధించిన కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని కోరారు. వార్పిన్, వైపని కార్మికులకు కూలీ పెంచాలని, మహిళాశక్తి చీరల ఆర్డర్ల కూలీ రేట్లను ముందు ప్రకటించాలని కోరారు. చేనేత జౌళిశాఖ అభివృద్ధి అధికారి రవీందర్‌రెడ్డి వస్త్రోత్పత్తిదారులతో మాట్లాడి కూలీ సమస్యను పరిష్కరిస్తామని, మహిళాశక్తి చీరల కూలీ రేట్లు వారం, పది రోజుల్లో నిర్ణయిస్తామన్నారు. బతుకమ్మ చీరల 10 శాతం యారన్ సబ్సిడీ డబ్బులకు సంబంధించి తుది నివేదిక సిద్ధమైందని పనిచేసిన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని వివరించారు. ప్రస్తుతం 90 నుంచి 150 కార్ఖానాలు విద్యుత్ బిల్లుల సమస్యలతో బందున్నాయని.. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సమ్మె విరమించి పనిలోకి వెళ్లాలని కోరారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ హైమద్ మాట్లాడుతూ పాలిస్టర్ కూలీ సమస్యపై కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌తో సమావేశం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. చర్చలు విఫలం కావడంతో శ్రీరామనవమి తర్వాత సమావేశం నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. చర్చల్లో పవర్‌లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, వార్పిన్, వైపని కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు.


