గుండె.. ఆగిపోతోంది | - | Sakshi
Sakshi News home page

గుండె.. ఆగిపోతోంది

Apr 1 2025 9:57 AM | Updated on Apr 1 2025 2:15 PM

గుండె.. ఆగిపోతోంది

గుండె.. ఆగిపోతోంది

వీణవంక(హుజూరాబాద్‌): జిల్లా ప్రజలకు గుండె దడ పట్టుకుంది. అప్పటిదాక బాగానే ఉంటున్నారు.. అంతలోనే గుండెపోటుతో అనంతలోకాలకు వెళ్తున్నారు. ఒకప్పుడు పట్టణవాసులకు ఎక్కువగా వస్తుందనేది ప్రచారం ఉండేది. కానీ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుండెదడ పట్టుకుంది. పొద్దంత పనులు చేసుకొని వచ్చి ఇంటి వద్ద సేద తీరేలోపు గుండెపోటుతో మృతిచెందుతున్నారు. అయితే పౌష్టికాహార లోపం, శారీరక శ్రమ లేకపోవడం, నీళ్లు సరిగా తాగకపోవడం వల్లే గుండెపోటు వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.

40 నుంచి 55లోపు వారే ఎక్కువ...

గుండెపోటు 40 నుంచి 55ఏళ్ల లోపు వారికే ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆరు నెలల వ్యవధిలో వివిధ వృత్తుల్లో ఉన్న దాదాపు 34 మంది గుండెపోటుతో మృతిచెందారు. కాగా గుండెపోటు ఉపాధి హామీ కూలీలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఎండలో పని చేయడం, సరైన నీరు తీసుకోకపోవడం గుండెపోటుకు ఒక కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు. కొంత మంది వ్యాయామం చేసినా గుండెపోటుకు గురవడం కలకలం రేపుతుంది.

వణుకు పుట్టిస్తున్న గుండెపోటు

ఉమ్మడి కరీంనగర్‌లో ఆరు నెలల వ్యవధిలో 34 మంది మృతి

ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలపై ఎక్కువ ప్రభావం

పాటించాల్సిన నియమాలు

ముఖ్యంగా ఉపాధి హామీ, వ్యవసాయం చేసే కూలీలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలి.

మిట్ట మధ్యాహ్నం ఎండలో పని చేయరాదు.

శ్రమకు తగ్గ నీరు లేదా నిమ్మరసం తీసుకోవాలి.

శరీర ఉష్ణోగ్రత ఎక్కవగా పెరగకుండ చెట్లకింద సేద తీరాలి. క్రమం తప్పకుండా బీపీ చెక్‌ చేసుకోవాలి.

పట్టణాలలో ఉండేవారు మానసిక ఒత్తిడికి లోనుకావద్దు. రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్‌, వ్యాయామం, యోగా చేయాలి.

పొగతాగడం మానేయాలి. ఆయిల్‌ పుడ్‌ సాధ్యమైనంత వరకు తగ్గించాలి.

గుండెపోటు లక్షణాలు

గుండెపోటు రావడానికి కారణం గుండెకు సంబంధించి కండరాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీన్నే గుండేపోటు అంటారని వైద్యులు చెబుతున్నారు. ఎడమ చేతి వైపు లాగినట్లు అనిపిచ్చి, ఛాతిలో నొప్పి వస్తుంది. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

వ్యవసాయ కూలీలకు ఎక్కవగా ఎందుకు వస్తుందంటే వారు శ్రమకు తగ్గ నీరు తీసుకోకపోవడమే ప్రధాన కారణం.

ఎండలో ఎక్కవగా పని చేయడం వల్ల చెమట ద్వారా లవణాలు కరిగిపోతాయి. లవణాలు తగ్గి గుండె ఎక్కవగా కొట్టుకోవడం కాని, గుండె ఆగిపోవడం జరుగుతుంది. అయితే కూలీలు పని మీద ఉండి నీళ్లు ఎక్కువగా తీసుకోకపోవడం ఒక కారణం.

వంశపార్యంగా గుండెపోటు వస్తుందని కూడా ఒక కారణంగా వైద్యులు ధ్రువీకరిస్తున్నారు.

ఎండలో ఎక్కువ సమయం పని చేయడం వల్ల గుండె ఆగిపోవడం జరుగుతుంది. 7 గంటలు ఎండలో పని చేస్తే కనీసం రెండుగంటలు విశ్రాంతి తీసుకోవాలి.

శారీరక శ్రమ అవసరం

పతి మనిషికి శారీరక శ్రమ అవసరం. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఊబకాయం, బీపీ, షుగర్‌ పొగతాగడం అలవాటు ఉన్నవారికి గుండెపోటు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఎండలో పని చేసినప్పుడు సరైన నీరు తీసుకోవాలి. ఎడమచేతి వైపు నొప్పి వచ్చినట్‌లైతే డాక్టర్లను సంప్రదించాలి.

– డాక్టర్‌ గొట్టె శ్రావణ్‌, పీహెచ్‌సీ వైద్యుడు, శంకరపట్నం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement