రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించాలి | - | Sakshi
Sakshi News home page

రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించాలి

Mar 29 2025 12:12 AM | Updated on Mar 29 2025 12:14 AM

● మంత్రి తుమ్మలను కలిసిన కవ్వంపల్లి

ఇల్లంతకుంట(మానకొండూర్‌): రాయితీపై వ్యవసాయ పనిముట్లు రైతులకు అందించాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. శుక్రవారం సచివాలయంలో కలిసి ఈమేరకు విన్నవించారు. మానకొండూరు నియోజకవర్గంలోని సాగునీటి సమస్య గల మండలాలకు డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా సేద్యం చేసుకొనుటకు కావలసిన వ్యవసాయ పరికరాలు రాయితీపై అందించాలని కోరారు.

వివరాల నమోదుకు సహకరించాలి

ఏడీఏ రత్నాకర్‌

ముస్తాబాద్‌(సిరిసిల్ల): వివరాల నమోదుకు చేపట్టిన డిజిటలైజేషన్‌కు రైతులు సహకరించాలని వ్యవసాయ సహాయ సంచాలకుడు రత్నాకర్‌ కోరారు. ముస్తాబాద్‌ మండలం చీకోడు, మోహినికుంటల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు నమోదుపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఏడీఏ మాట్లాడుతూ రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్కులతోపాటు ఆధార్‌ ద్వారా డిజిటలైజేషన్‌ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టిందని తెలిపారు. దీని ద్వారా రైతులకు ప్రత్యేక గుర్తింపుకార్డును ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతుభరోసా, రుణమాఫీకి దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. రైతు విశిష్ట సంఖ్యను పొందుటకు ఆధార్‌, పాస్‌బుక్కు, ఫోన్‌నంబర్‌లను సమీపంలోని వ్యవసాయ అధికారులకు అందజేసి నమోదు చేసుకోవాలని కోరారు. మండల వ్యవసాయాధికారి దుర్గ రాజు, ఇతర అధికారులు రెబల్సన్‌, చిరంజీవి, నరేశ్‌ పాల్గొన్నారు.

కరెంట్‌ కనెక్షన్‌లు తొలగించొద్దు

వీర్నపల్లి(సిరిసిల్ల): అధిక బకాయిలు ఉన్నాయనే కారణంతో కరెంట్‌ కనెక్షన్‌లు తొలగించొద్దని కోరుతూ వీర్నపల్లి మండలంలోని అడవిపదిర గ్రామస్తులు శుక్రవారం సెస్‌ ఆఫీస్‌ ఎదుట ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ గతంలో పనిచేసిన సెస్‌ అధికారి నిర్లక్ష్యంతోనే గ్రామంలో విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయని, ఇప్పుడు వాటిని చెల్లించాలంటూ కరెంట్‌ కనెక్షన్‌లు తొలగించడం సరికాదన్నారు. అనంతరం సెస్‌ ఏఈ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజాసంఘాల నాయకులు మల్లారపు అరుణ్‌కుమార్‌, జాలపెల్లి మనోజ్‌కుమార్‌, గ్రామస్తులు రాజవ్వ, పద్మ, దేవవ్వ, పూర్ణిమ, వనిత, ఎల్లవ్వ, పుష్ప, మంజుల, రాజవ్వ, ప్రకాశ్‌, క్రాంతి, జాషువా, కార్తీక్‌, మనోభిషేక్‌, విష్ణు రాబిన్‌సన్‌ పాల్గొన్నారు.

డాక్టర్‌ పోస్టుల ఖాళీల భర్తీ

సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రి, గంభీరావుపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేస్తామని జిల్లా వైద్య విధాన పరిషత్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.పెంచలయ్య శుక్రవారం ప్రకటనలో తెలిపారు. వేములవాడ ప్రాంతీయ వైద్యశాలలో ఖాళీగా ఉన్న రెండు గైనకాలజిస్ట్‌, మూడు డ్యూటీ డాక్టర్‌ పోస్టులు, గంభీరావుపేట సీహెచ్‌సీలో జనరల్‌ ఫిజీషియన్‌ లేదా పిల్లల వైద్యనిపుణుల పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వేతనం నెలకు స్పెషలిస్ట్‌ డాక్టర్‌కు రూ.లక్ష, జనరల్‌ డాక్టర్లకు రూ.52,351 చెల్లిస్తారని వివరించారు. ఆసక్తి గల వారు సర్టిఫికెట్లతో ఏప్రిల్‌ 2న కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు.

రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించాలి 
1
1/2

రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించాలి

రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించాలి 
2
2/2

రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement