
నర్సరీలో మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్ అనురాగ్ జయంతి
● ప్రతీ శుక్రవారం ట్యాంకర్లతో నీళ్లు ● ఎండిపోకుండా కాపాడుతున్న సిబ్బంది ● జిల్లాలో 345 ప్రాంతాల్లో మొక్కల సంరక్షణ
ఇది ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి శివారులో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు. వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. నాటిన మొక్కలు ఎండల ధాటికి వాడిపోతున్నాయి. ఈ క్రమంలో గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బంది ట్యాంకర్‌తో నీళ్లు పోస్తూ మొక్కలు ఎండిపోకుండా చూస్తున్నారు.
సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను రక్షించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుండగా.. జిల్లా వ్యాప్తంగా 255 గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో 190, ప్రైవేటు భూముల్లో 65 నర్సరీలను ఏర్పాటు చేశారు. కొత్తగా 43.98 లక్షల మొక్కలను పెంచారు. ఈ ఏడాది జిల్లాలోని 12 మండలాల్లో 19,17,248 మొక్కలను హరితహరంలో భాగంగా నాటగా.. 18,40,558 మొక్కలు బతికి ఉన్నాయి. జిల్లాలో వనసంరక్షణను బాధ్యతగా చేపట్టారు. కలెక్టర్ అనురాగ్ జయంతి ఏ గ్రామానికి విజిటింగ్‌కు వెళ్లిన హరితహారం, పల్లెప్రకృతి వనాలు, ఎవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటున్నారు. గ్రామసర్పంచులు, వార్డుసభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది ఎవరికి వారు గ్రామాల్లో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రతీ వారం నీరు పోయాలి..
జిల్లాలో ప్రతీ వారం ట్యాంకర్లతో మొక్కలకు నీరు పోయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎండలు ముదురుతున్నాయి. ఇలాంటి సమయంలో విధిగా మొక్కలకు నీరుపోయాల్సిందే. ప్రతీవారం ట్యాంకర్లతో నీరు పోస్తూ మొక్కలు ఎండిపోకుండా చూడాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.
– ఎ.రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలో ఎవెన్యూ ప్లాంటేషన్ స్వరూపం
ఎవెన్యూ ప్లాంటేషన్ లక్ష్యం : 250 కిలోమీటర్లు
పీఆర్ రోడ్లు : 148 కిలోమీటర్లు
నాటిన మొక్కలు : 1,04,419
ఆర్‌అండ్‌బీ రోడ్లు : 102 కిలోమీటర్లు
నాటిన మొక్కలు : 63,350
అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు : 3,08,617

