
భోజనం చేస్తున్న వలస కార్మికులు
ఇతని పేరు దాసరి కుమారస్వామి. తొమ్మిదేళ్ల కింద హుజురాబాద్ నుంచి వచ్చి టీస్టాల్ పెట్టుకున్నాడు. దీనికి తోడు ఇరవైమంది కార్మికులకు భోజనం వండి పెడుతున్నాడు. ఒక్కో కార్మికుడు ప్రతివారం రూ. 500 నుంచి 550 వరకు ఇస్తారు. 18 గంటలకు పైగా కష్టపడినా ఇల్లు, టీస్టాల్ రెండూ అద్దెవి కావడంతో ఖర్చులకే సరిపోతుందని వాపోతున్నాడు.
సిరిసిల్లకల్చరల్ : దశబ్దాలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వలస కార్మికులకు ఉపాధినిచ్చే కేంద్రంగా మారింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వందలాది మంది నేత కార్మికులు వలసవచ్చి ఉపాధి పొందుతున్నారు. ఉండడానికి ఆవాసం లేక ఇబ్బందులు పడుతునన్నారు. భార్యా పిల్లలకు దూరంగా ఉంటూ చేనేత కార్మికులుగా పనులు చేసుకుంటున్నారు. పనిచేసే చోట కలిసిన ఇతర కార్మికులనే స్నేహితులుగా మలుచుకుంటూ కాలం గడుపుతునన్నారు. కార్ఖానాలో పని, భోజనం, నిద్ర ఒక్కో అవసరానికి ఒక్కో చోటు వెదుక్కోవాల్సిందే. వీరినే ఆధారం చేసుకుని వలస కార్మికులకు ఆహారం వండిపెడుతూ ఉపాధి పొందుతున్న వారు కొందరైతే, రాత్రిపూట నిద్ర, విశ్రాంతి తీసుకునేందుకు ఆశ్రయం కల్పిస్తున్న వారు మరికొందరు. రాత్రి డ్యూటీ చేసే వాళ్ల కోసం అర్ధరాత్రి పూట టీహోటళ్లు నడుపుతూ కొంతమంది ఉపాధి పొందుతున్నారు.
మరో భీవండిగా మారిన సిరిసిల్ల
దశాబ్దాలుగా సిరిసిల్ల వస్త్రోత్పత్తికి మారుపేరుగా నిలుస్తోంది. మహారాష్ట్రలోని భీవండి, షోలాపూర్‌లా, వలస కార్మికులకు ఉపాధినిస్తోంది. మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల నుంచి చాలామంది పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లేది. రాష్ట్రం ఆవిర్భవించాక సిరిసిల్లకు ప్రభుత్వపరమైన ఆర్డర్లు రావడంతో కార్మికులకు పని దొరుకుతోంది. వందలాది కార్మికులకు రాత్రయితే పడుకునేందుకు ఆశ్రయం ఉండదు. నెలకు రూ.400 తీసుకుని కొందరు వీరికి పడుకునేందుకు ఆశ్రయం కల్పిస్తున్నారు. రోజూ రెండు పూటలా భోజనం కోసం వంట చేసి పెట్టేవాళ్లను ఆశ్రయిస్తున్నారు. కార్మిక ప్రాంతాలైన సుభాష్‌నగర్, నెహ్రూనగర్, బీవైనగర్, సుందరయ్య నగర్, గణేశ్‌నగర్, వెంకంపేట, రాజీవ్‌నగర్, ముష్టిపెల్లి, తదితర ప్రాంతాల్లో ఈ తరహా ఆశ్రయ, ఆహార కేంద్రాలు నడుస్తున్నాయి. వలస కార్మికులకు ప్రభుత్వపరమైన ఆశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అభిప్రాయం.
ఐదేళ్లుగా ఇక్కడే సాంచెలు
నడుపుతున్నా..
మాది జగిత్యాల జిల్లా నర్సింహులపల్లె. సుమారు నలబై ఏళ్లవరకు పైగా భీవండిలో సాంచెలు నడిపే పని చేసిన. వయసు పెరగడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో సిరిసిల్లకు వచ్చిన. ఐదేళ్లుగా ఇక్కడే సాంచెల పనిచేస్తున్న. పొట్టకు తినుడు చిన్నప్పటి నుంచి అలవాటైంది. రాత్రిపూట ఇంకో చోట పడుకుంటాను.
– ద్యావనపెల్లి సత్తయ్య, నేత కార్మికుడు
మాటవోతే
మంచిగుండదని
నా చిన్నతనంలో తండ్రి కష్టం చేయకపోవడంతో తల్లి నన్ను భీవండికి తీసుకెళ్లింది. ఇపుడు అరవై ఏళ్లు వయసు మీదపడడంతో కొన్నేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను. రెక్కలు ముక్కలు చేసుకున్నా మిగిలేది కొంతే. అప్పులు తీరుతలేవు. అయినా అప్పు తెచ్చుకున్న కాడ మాటవోతే బాగుండదని కష్టపడుతూ బతుకు ఎల్లదీస్తున్నా.
–ఎలిగేటి వెంకటరమణ , ఆరవెల్లి గ్రామం,
పెగడపల్లి మండలం
ఇరవై ఏళ్లు
భీవండిలో పనిచేసిన
ఇరవై ఏళ్లపాటు భీవండిలో పనిచేసిన. ఐదేండ్లాయె సిరిసిల్లకు వచ్చి సాంచెలు నడుపుతున్నా. నాకు కొడుకు, ఇద్దరు కుమారులు. వారానికి మూడు నాలుగు వేలు వస్తయి. రోజువారీ ఖర్చులు పోను మిగిలేది కొంతే. ఎల్లినకాడికి ఇంటికి పంపుతుంటాను.
–జోగు ఓదెలు, కమలాపూర్
నేత పనిలో
బర్కత్ ఉంటలేదు
1970 నుంచి భీవండిలో నేత కార్మికుడిగా పనిచేసేందుకు వెళ్లాను. అప్పటినుంచి ఇదే పని.ఇపుడు నాకు అరవై ఏళ్లు. ఏడేళ్ల కింద సిరిసిల్లకు వచ్చి సాంచెలు నడుపుతున్నాను. పనిచేసుకుంటూ లక్ష రూపాయల అప్పు కట్టేందుకు తిప్పలు పడుతున్న. ఇంటికి నెలకు రెండువేలు పంపిస్తున్నాడు. నేత కార్మిక పనిలో బర్కత్ ఉంటలేదు. –గుర్రం మల్లేశం, ఆరవెల్లి గ్రామం.
వివిధ జిల్లాల నుంచి ఉపాధికోసం సిరిసిల్లకు నెలంతా కష్టపడినా.. ఖర్చులకే పరిమితం అయినవాళ్లకు దూరంగా శ్రమజీవులు




