బలిపశువులైంది బడుగులే! | - | Sakshi
Sakshi News home page

బలిపశువులైంది బడుగులే!

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

నాగులుప్పలపాడు: కూటమి నాయకుల ఆధిపత్య పోరుకు నిరుపేద జీవాల కాపరులు బలైపోయారు. పరాయి గ్రామం నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన బడుగుల జీవితాలను కూటమి నాయకుల పంతాలు, పగలు చిన్నాభిన్నం చేశాయి. బాపట్ల జిల్లా పెదగంజాంకు చెందిన గొర్రెల కాపరులు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు కావూరి వాసు చేలో గొర్రెల పెంట కట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పక్కనే చేనున్న టీడీపీ నాయకుడు ఉప్పల సుబ్బారావుకు, వాసుకు పాత కక్షలు ఉన్నాయి. వాసుపై ఉన్న కక్షను సుబ్బారావు అమాయక గొర్రెల కాపరులపై చూపించాడు. గత పంటకు సంబంధించిన ఒకటి రెండు మొక్కజొన్న మొలకలను గొర్రెలు మేశాయనే నెపంతో ఎల్లావుల అనీల్‌పై సుబ్బారావు తొలుత దాడికి దిగాడు. అంతటితో ఆగక తన అనుచరులను పిలిపించి అనీల్‌ను మూకుమ్మడిగా చితకబాదారు. ఈ దాడిలో అనీల్‌ భుజం కీలు జారిపోయింది. ప్రాధేయపడిన మరో కాపరి వడ్లమూడి మధును సైతం శ్రీగొల్ల నా కొడకల్లారాశ్రీ అంటూ కులం పేరుతో, అసభ్య పదజాలంతో దూషిస్తూ విచక్షణా రహితంగా కొట్టారు. గాయపడిన యువకులు న్యాయం కోసం సాయంత్రం గ్రామంలోని పెద్దమనుషుల వద్దకు వెళ్లగా, టీడీపీ కార్యాలయం వద్ద అధికార పార్టీ ఉన్న నిందితులు మరోమారు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణాన్ని పక్కదోవ పట్టించేందుకు సుబ్బారావు డ్రామాలకు తెరలేపాడు. చేలో పచ్చిరొట్ట ఎరువు పంటను గొర్రెలు మేసేశాయంటూ అబద్ధాలు ప్రచారం చేశాడు. అసలు చేలో పంటే లేకపోవడంతో, అధికారులు వస్తే తన బండారం బటయపడుతుందని మంగళవారం ఉదయం హడావిడిగా చేనును దున్నేశాడు. దౌర్జన్యానికి పాల్పడిన అధికార పార్టీ నాయకులను కాపాడేందుకు పోలీస్‌ యంత్రాంగం వత్తాసు పలకడం గమనార్హం. బాధితుల ఫిర్యాదును కేవలం సాధారణ దాడిగా చిత్రీకరిస్తూ, ఎదురు దాడి చేసిన వారి ఫిర్యాదుతో బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు.

నిందితులపై హత్యాయత్నం కేసు పెట్టాలి

ఈ అన్యాయంపై అఖిల భారత యాదవ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులతో కలిసి ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించడంతో పాటు, జూన్‌ 15న కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. బాధితులపై పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే ఎత్తివేయాలని, పక్కా ప్రణాళికతో హత్యాయత్నానికి పాల్పడిన టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈదుమూడి ఘటనకు కూటమి నాయకుల

ఆధిపత్య పోరే కారణం

అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికార యంత్రాంగం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement