ట్రావెల్స్‌ బస్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్‌ బస్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్‌

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

ట్రావెల్స్‌ బస్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్‌

8 మందికి గాయాలు

గుడ్లూరు: హైవే మార్జిన్‌ వెంట నిలిపి ఉంచిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన 16వ నంబరు జాతీయ రహదారిపై గుడ్లూరు మండలం శాంతినగర్‌ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఏలూరు నుంచి నాగూర్‌(నాగపట్నం) వైపు వెళ్తున్న భార్గవి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు శాంతినగర్‌ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉంది. అదే సమయంలో విజయవాడ నుంచి కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకొచ్చి, ఆగి ఉన్న ప్రైవేట్‌ బస్సును వెనుక వైపు బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రైవేట్‌ బస్సు రోడ్డు పక్కనే ఉన్న జామాయిల్‌ తోటలోకి దూసుకెళ్లింది. ప్రమాదం ధాటికి ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. సంఘటన స్థలాన్ని గుడ్లూరు ఎస్సై తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రైవేట్‌ బస్సులో ప్రయాణిస్తున్న గడికోట ధనలక్ష్మి, జనసూత్రపు రాజేశ్వరి, తుమ్మలపల్లి రేష్మా, కోరా రాధమ్మ, కోడలూరు నాగమణి, దుక్కపాటి మార్తమ్మ, బెల్లం జయరాం, కోడూరు సుబ్బారావు సహా మొత్తం ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement