బల్లికురవ: బైకు అదుపుతప్పి వ్యక్తి మృతిచెందిన సంఘటన బల్లికురవ–కొమ్మాలపాడు ఆర్‌అండ్‌బీ రహదారిపై బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువు మలుపులో ఆదివారం చోటుచేసుకుంది. చెన్నుపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి రామయ్య (48) సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో అమ్మవారి కొలుపులకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలపాలైన రామయ్యను స్థానికుల సమాచారంతో 108 వాహనం వచ్చి మార్టూరు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. మృతునికి భార్య భూలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భూలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై వై.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు టౌన్: నగరంలోని రావి ఆంజనేయులు వీధిలో పేకాట శిబిరంపై ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కోతముక్క ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి సీఐ కమలాకర్ ఆధ్వర్యంలోని బృందం ఆకస్మికంగా దాడి చేసి పేకాటరాయుళ్ల నుంచి రూ.4,860 నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పట్టుబడిన వారిని నగదుతో సహా తాలూకా పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఎస్సై చెంచయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.
● మహిళకు తీవ్ర గాయాలు
● విమాన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రాక్‌పై ప్రమాదం
సింగరాయకొండ: మండల పరిధిలోని జాతీయ రహదారిపై గల విమాన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రాక్‌పై ఆదివారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే పోలీసుల కథనం ప్రకారం.. చైన్నెకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు కారులో విజయవాడ వెళ్తున్నారు. మార్గమధ్యంలో కారు సింగరాయకొండ పరిధిలోని విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై ఉన్న కుంభకోణం కాఫీ షాప్ సమీపంలోకి రాగానే, అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న సిమెంటు దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సిమెంటు దిమ్మెతో సహా కారు నెల్లూరు వైపు వెళ్లే రోడ్డు మధ్యలోకి దూసుకెళ్లి ఆగింది. ఆ సమయంలో హైవేపై ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కారులో ప్రయాణిస్తున్న గోమతి అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో, హైవే అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై ఎల్.సుధీర్‌కుమార్ పరిశీలించారు. రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా హైవే పోలీసు సిబ్బంది శశిధర్‌రెడ్డి చర్యలు చేపట్టారు.


