అత్యధికంగా 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు పలు కాలనీల్లో నిలిచిన వర్షం నీరు పొంగిన వాగులు, వంకలు చింతగుంట్లలో పిడుగుపాటుతో కాలిపోయిన చెట్టు
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంతో పాటు తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. శనివారం వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కురిసిన వర్షంతో మార్కాపురంలో 6.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. తర్లుపాడులో 12.2 మిల్లీమీటర్లు, పెద్దారవీడులో 8.6, పుల్లలచెరువులో 5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మార్కాపురం నుంచి కుంట, తర్లుపాడు, తర్లుపాడు నుంచి బొడిచర్ల గ్రామాలకు వెళ్లే రహదారులపై వాగులు పొంగి ప్రవహించడంతో మధ్యాహ్నం 12 గంటల వరకూ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని చింతగుంట్ల గ్రామంలో శనివారం వేకువజామున మంగమూరి రమణయ్యకు చెందిన పొలంలో ఉన్న చెట్టుపై పిడుగు పడటంతో కాలిపోయింది. ఆ చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. చెన్నారెడ్డిపల్లి ఎస్సీకాలనీలో భారీగా వర్షం నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. గృహాల్లోకి వర్షం నీరు రావడంతో అవస్థపడ్డారు. కాలనీల్లో మురుగునీరు పోయేందుకు కాలువలు కట్టి అంతర్గత రోడ్లు వేయాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. మార్కాపురం పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీ, పీఎస్ కాలనీ, ఎస్టేట్, రాజ్యలక్ష్మికాలనీ, తదితర ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున వర్షం నీరు చేరింది. మధ్యాహ్నం వరకూ ప్రజలు బయటకు రాలేక తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఒంగోలులో ఈదురు గాలులతో వర్షం...
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒంగోలులో రాత్రి పది గంటల నుంచి ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం నగర ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అదే సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు మరింత ఇబ్బందిపడ్డారు.


