● వ్యాపారులు, పొగాకు బోర్డు అధికారులకు తేల్చిచెప్పిన పొగాకు రైతులు
ఒంగోలు సబర్బన్: ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో ఎఫ్–3 రకం పొగాకును కేజీ రూ.160కి తగ్గకుండా వ్యాపారులు కొనుగోలు చేయాలని, అంతకన్నా తగ్గించడానికి వీల్లేదని పొగాకు రైతులు తేల్చి చెప్పారు. సదరన్ బ్లాక్ సాయిల్ (ఎస్‌బీఎస్), సదరన్ లైట్ సాయిల్స్ (ఎస్‌ఎల్‌ఎస్) భూముల రైతులు శనివారం ఒంగోలులోని పొగాకు బోర్డు ఆర్‌ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సమావేశమయ్యారు. మూడు జిల్లాల్లోని 11 వేలం కేంద్రాలకు చెందిన రైతు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. లో గ్రేడ్ రకం పొగాకు అసలు కొనుగోలు చేయడం లేదన్నారు. ఎఫ్–3 రకం పొగాకును తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, కానీ, కేజీ పొగాకు ధరను రూ.160 కంటే తగ్గిస్తే అంగీకరించేది లేదని ఏకగ్రీవంగా తీర్మానించారు. 2026–27 సీజన్‌కు క్రాపు సైజు ఎంత ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రీజియన్లకు సమాన నిష్పత్తి ప్రకారం ఎంతవస్తే అంత కొనాలని వ్యాపారస్తులు, పొగాకు బోర్డు అధికారులను డిమాండ్ చేశారు. 2025–26 సీజన్‌కు ఇచ్చిన క్రాప్ సైజు ప్రకారం 142 మిలియన్ల పొగాకు కొంటామని గతంలో వ్యాపారస్తులు అంగీకారం తెలిపారన్నారు. అంతవరకై నా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత పంట కాలంలో ఇచ్చిన కోటా ప్రకారం కచ్చితంగా వ్యాపారులు కొనుగోలు చేయాలని తీర్మానించారు. ఎస్‌బీఎస్, ఎస్‌ఎల్‌ఎస్ భూముల్లో పండించిన పొగాకుకు కేజీకి రూ.222 ఖర్చయిందని, గత సంవత్సరం ఇచ్చిన కోటాపోను మిగతా పొగాకును వచ్చే సంవత్సరం వేలం ద్వారా అమ్ముకుంటామని రైతులు తేల్చారు. 2026 జూన్ 8వ తేదీ గుంటూరులోని పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత తేలిక నేలలు, నల్లరేగడి నేలలు, ఉత్తర ప్రాంత తేలిక నేలలకు సంబంధించిన అన్ని వేలం కేంద్రాల రైతు ప్రతినిధులు, వ్యాపారస్తులతో పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ, చైర్మన్ యశ్వంత్ సమక్షంలో సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశంలో ఆథరైజేషన్ కలిగి ఉన్న 142 మిలియన్ల పొగాకు వ్యాపారస్తులకు అవసరం లేకుంటే మిగతా పొగాకును వచ్చే సీజన్‌లో అమ్ముకుంటామని రైతులు తేల్చి చెప్పారు. వ్యాపారులెవరూ పొగాకు బోర్డు ఈడీ ఆదేశాల ప్రకారం కొనకపోగా, ఈడీ సమావేశం తర్వాత కేజీకి రూ.15 నుంచి రూ.20 తగ్గించి కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాలకు చెందిన పొగాకు వేలం కేంద్ర రైతు నాయకులు నాగినేని భాస్కర్ చౌదరి, బి.బ్రహ్మ, ఏ శేషగిరిరావు, బి.వి.కృష్ణారెడ్డి, ఎస్.గురవారెడ్డి, గుండాల కేదారనాథ్, ఎం.మాధవరావు, ఎస్.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


