ఒంగోలు టౌన్: ఇంటలిజెన్స్ డీఎస్పీ వేలమూరి శ్రీరాం(55) గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసు శాఖ విషాదంలో మునిగిపోయింది. ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గాయత్రి నగర్‌లో నివసిస్తున్న ఆయనకు బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో గుండెలోనొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ను స్థానికంగా కార్పొరేట్ వైద్యశాలకు తరలించారు. వైద్యులు రెండు గంటల పాటు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ రాత్రి 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీరాం తండ్రి కృష్ణమూర్తి కూడా పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేశారు. జిల్లాలో ఎస్సైగా దోర్నాల, మార్టూరు, గిద్దలూరు, చీరాల టుటౌన్, కందుకూరు, ఒంగోలు తాలుకా, మార్కాపురంలలో పనిచేశారు. ఆ తరువాత సీఐగా పదోన్నతి పొంది కందుకూరు, గిద్దలూరు, దర్శి, పొదిలిలో విజిలెన్స్ సీఐగా పనిచేశారు. దీర్ఘకాలంగా ఒంగోలు ఇంటలిజెన్స్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. గత నెలలో డీఎస్పీగా పదోన్నతి రాగా ఇంటలిజెన్స్‌లోనే కొనసాగుతున్నారు. ఆయన ఎక్కడ విధులు నిర్వహించిన అక్కడి ప్రజలతో మమేకమౌతూ వారి మన్ననలు పొందారు. పనిచేసిన చోటల్లా తనదైన ముద్ర వేసుకున్నారు. జిల్లా ప్రజలకు ఆయన బాగా సుపరచితులు.
సాహితీ ప్రియుడు...
పోలీసు శాఖలో బిజీగా ఉన్నా ఏమాత్రం తీరికదొరికినా పుస్తకాలు చదవడం ఆయనకు చాలా ఇష్టం. మంచి సాహితీ ప్రియుడు. ఆయన కార్యాలయంలో గదిలో ఎటు చూసినా పుస్తకాలు కనిపిస్తాయి. ప్రసిద్ధిచెందిన రచయితల పుస్తకాలను తెప్పించుకుంటారు. తెలుగు సాహిత్యంలో వచ్చిన కథలు, కవిత్వంపై గంటల తరబడి చర్చిస్తారు. ఎందరో సాహితీవేత్తలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఫిలాసఫీ, వామపక్ష, బహుజన సాహిత్యం అధికంగా చదివేవారు. ఆయన మృతి చెందారని తెలిసి పోలీసు శాఖలోనే కాకుండా ఎంతో మంది సాహిత్య వేత్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇంటలిజెన్స్ ఏడీజీ మహేష్‌చంద్ర లడ్హా, ఇంటలిజెన్స్ ఎస్పీలు రామ్మోహన్‌రావు, లావణ్యలక్ష్మీ, ఎస్పీ హర్షవర్థన్ రాజు, ఇంటలిజెన్స్ అధికారులు రమాదేవి, ఖాదర్ బాషా, డీస్పీలు, సీఐలు శ్రీరామ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఇంటలిజెన్స్ సిబ్బంది, పోలీసులు, విఽవిధ శాఖల ఉన్నతాధికారులు శ్రీరామ్ మృతికి నివాళులర్పించారు. సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.


