ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ నెల 20న జరిగే జోన్–4 విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు కనపర్తి శేషారెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే అన్ని జోన్లలోనూ ప్రచార కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒంగోలు తర్వాత కడప, రాజమండ్రి, విశాఖపట్నంలలో ప్రచార కమిటీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలను 2029 ఎన్నికలకు సమాయత్తం చేస్తామన్నారు. 2019 నుంచి 2024 వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. పేదలు, అట్టడుగు వర్గాలకు భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహామ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొవడమే కాకుండా ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడినా, చేసిన అభివృద్ధి పనులను చెప్పుకోలేకపోయామన్నారు. మరోసారి అలాంటి సమస్య పునరావృతం కాకుండా గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేసి కూటమి అబద్ధాలను, కుట్రలను తిప్పికొడతామన్నారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ టీడీపీ, జనసేన కలిసి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, అబద్ధాలను తిప్పికొట్టేందుకు ప్రచార కమిటీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రచార విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాకు ఉమావల్లీ యాదవ్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలందరికీ తెలియజేసేలా ప్రచార కమిటీ కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన హామీలను నెరవేర్చలేక, ప్రజలకు తమ ముఖాన్ని చూపించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇచ్చి ఎల్లోమీడియా ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. జగనన్న వేసిన అభివృద్ధిని తాను చేసినట్లుగా చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడటం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి పావనికుమారి, ప్రచార విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జిలానీ, వైఎస్సార్ సీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


