పట్టు సాగుపై రైతులు ఆసక్తి పెంచుకోండి | - | Sakshi
Sakshi News home page

పట్టు సాగుపై రైతులు ఆసక్తి పెంచుకోండి

Apr 16 2026 9:54 AM | Updated on Apr 16 2026 9:54 AM

పట్టు సాగుపై రైతులు ఆసక్తి పెంచుకోండి కుమార్తె పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తూ.. నకిలీ కార్‌ స్టిక్కర్ల తయారీ.. ఒకరు అరెస్ట్‌

కలెక్టర్‌ విజయసునీత

మార్కాపురం: పట్టుసాగుపై రైతులు ఆసక్తి పెంచుకోవాలని కలెక్టర్‌ విజయసునీత సూచించారు. మార్కాపురం పట్టు పరిశ్రమ కార్యాలయంలో బైఓల్టిన్‌ పట్టు పరిశ్రమ సాగుపై బుధవారం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పట్టుసాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సబ్సిడీ ఇస్తున్నాయని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, ఇతర రైతులకు 50 శాతం రాయితీ కల్పిస్తోందన్నారు. జిల్లాలో 480 మంది రైతులు 1200 ఎకరాల్లో పట్టుసాగు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మల్బరీ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సాధారణ పంటల కంటే పట్టు పంట సాగుద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. అనంతరం సబ్సిడీపై వచ్చిన యంత్ర పరికరాలను రైతులకు అందచేశారు. జిల్లా పట్టు పరిశ్రమ అధికారి సుజయ్‌కుమార్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ అరుణకుమారి, శాస్త్రవేత్త ఇబ్రహీం బాషా తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

బేస్తవారిపేట: మోటారు సైకిల్‌ను కారు ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలై మృతి చెందారు. ఈ సంఘటన బుధవారం బేస్తవారిపేట మండలంలోని చింతలపాలెం సమీపంలో హైవే రోడ్డుపై చోటుచేసుకుంది. బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం గ్రామానికి చెందిన కర్నాటి గురువారెడ్డి తన కుమార్తె వివాహ పెళ్లి పత్రికలు పంచేందుకు కంభంకు మోటారుసైకిల్‌పై వెళ్తున్నాడు. చింతపాలెం మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా బేస్తవారిపేట వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో గురువారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్‌లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతుడికి భార్య మహాలక్ష్మమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బల్లికురవ: ఎమ్మెల్యేల పేరుతో నకిలీ కారు స్టిక్కర్లు తయారు చేస్తున్న వ్యక్తిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వై.నాగరాజు తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ప్రభుత్వం జారీ చేసిన కారు స్టిక్కర్లను పోలిన నకిలీ స్కిక్కర్లు తయారు చేసి విక్రయిస్తున్న విజయవాడకు చెందిన చేబ్రోలు నాగరాజును అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. నిందితుడి నుంచి రెండు నకిలీ కార్‌ పాసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement