బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 – 8లో..

న్యూస్‌రీల్‌

చంద్రబాబు ప్రభుత్వంలో గంగపుత్రులకు దక్కని భరోసా రెండేళ్లుగా సక్రమంగా అందని వేట విరామభృతి తొలి ఏడాది ఎగ్గొట్టి..రెండో ఏడాది అరకొరగా అందించి ఈ ఏడాది ఇంకా మొదలుకాని లబ్ధిదారుల గుర్తింపు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా మత్స్యకార భరోసా నేటి నుంచి 61 రోజుల పాటు కడలిలో వేట విరామం సోనాబోట్ల దాడి, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఒడిదుడుకుల మధ్య వేట

నేటికీ సిద్ధం కాని లబ్ధిదారుల జాబితా

మొక్కజొన్న రైతు మొర ఆలకించేదెవరు?

మొక్కజొన్న సాగు రైతులకు నష్టాలను మిగిల్చింది. ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.

కొత్తపట్నం సముద్ర తీరంలో నిలిపి ఉంచిన బోట్లు

కష్టాల కడలిలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ బతుకు నావ లాగుతున్న గంగపుత్రులను చంద్రబాబు ప్రభుత్వం వంచిస్తోంది. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చాక వారిని అడుగడుగునా విస్మరిస్తోంది. సంద్రంలో చేపలవేట నిషేధ సమయానికిగాను మత్స్యకారులకు అందించాల్సిన జీవన భృతి విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఎగనామం పెట్టింది. రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. ఇక మూడో ఏడు విరామ గంట మోగినా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలు కాలేదు. మరో వైపు తమిళనాడు సోనా బోట్ల దాడులు, ప్రకృతి విపత్తులతో సతమతమవుతున్న మత్స్యకారుల ఘోష ప్రభుత్వానికిపట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 45 వేలమంది మత్స్యకారులు పడుతున్న అవస్థలు పాలకులకు పట్టడంలేదు.

భృతి గంగపాలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

మ్మడి జిల్లాలో సముద్రతీరం సుమారు 70 కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉంది. తీరంలో 36 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు 45 వేల మందికి పైగా జనాభా. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో సుమారు 7,500 మంది లబ్ధిదారులు మత్స్యకార భరోసాకు అర్హులుగా గుర్తించారు. వారికి రూ.15 కోట్ల భృతి చెల్లించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం 2024 లో మత్స్యకార భరోసాను ఎగ్గొట్టింది. గత సంవత్సరం అందినప్పటికీ చాలామందికి భరోసా అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రెండో జాబితాలో ఇస్తానన్న చంద్రబాబు ప్రభుత్వం నామమాత్రంగా ఇచ్చి చేతులు దులుపుకుంది. ఫలితంగా 61 రోజులపాటు వేటకు దూరమైన మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా అవస్థలు పడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10 వేలు చొప్పున మత్స్యకార భరోసా అందించింది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాక ముందు వేట విరామ భృతి కేవలం రూ.4 వేలు మాత్రమే ఇచ్చేవారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మొత్తాన్ని పెంచి ఒక్కసారిగా రూ.6 వేలు పెంచి రూ.10 వేలు ఇస్తూ వచ్చారు. భృతితో పాటు వివిధ రాయితీలు, సంక్షేమ పథకాలు అందేవని, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కడలి పుత్రుల సంక్షేమం గురించి పట్టించుకోవడంలేదని సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.

ఒడిదుడుకుల మధ్య చేపల వేట

వరుస ప్రకృతి విపత్తులు ఒకవైపు... తమిళనాడు కడలూరు, పాండిచ్చేరి కరెక్కల్‌ సోనాబోట్ల దాడులతో చేపల వేట ఆశాజనకంగా లేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ తుఫాన్‌లు, అల్పపీడనాలు రావటంతో వేట సక్రమంగా సాగలేదని, ఒకవేళ వేటకు వెళ్లినా మత్స్య సంపద సక్రమంగా పడలేదని, చివరికి ఖర్చులు కూడా రాలేదని వాపోయారు. తమిళనాడు రాష్ట్రం కడలూరు, పాండిచ్చేరి కరైకల్‌కు చెందిన సోనాబోట్లు తీరంలో విధ్వంసం సృష్టిస్తూ మత్స్యసంపదను కొల్లగొడుతున్నాయి. భారీ బోట్లు, మారణాయుధాలతో దాడులకు పాల్పడి వలలను ధ్వంసం చేసి విలువైన సంపదను దోచుకెళ్తున్నా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నామన్నారు. ఈ బోట్ల కారణంగా లక్షలాది రూపాయల విలువైన వలలు ఆర్థికంగా నష్టపోయామని, ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లినా స్పందన కనిపించలేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో తాము ప్రాణాలకు తెగించి పాండిచ్చేరి కరైకల్‌కు చెందిన నాలుగు సోనాబోట్లు పట్టుకుని జువ్వలదిన్నె హార్బర్‌లో ఉంచామని, అయితే వాటిని టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు కుట్రలు చేసి వదిలేశారని ఆరోపించారు. వారితో పెద్ద ఎత్తున డీల్‌ కుదుర్చుకుని బోట్లను వదిలేసి ప్రకాశం, నెల్లూరు జిల్లాల మత్స్యకారులకు తీరని ద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బోట్లు వదిలేసింది బీదా, అధికార పార్టీ నాయకులేనని ఇటీవల పాకలలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు హాజరైన సమావేశంలో స్పష్టమైంది. నెల్లూరు జిల్లా ఇస్కపాలెం మత్స్యకారులు ముగ్గురికి రూ.30 లక్షలు ఇచ్చి బోట్లను వదిలేశారని ఈ సమావేశంలో తేలింది. ఇది జరిగి ఐదు రోజులు కావస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్లు వదిలేసిన ఘటనపై మంత్రులతో కమిటీని వేశామని, నాలుగు పెట్రోలింగ్‌ బోట్లను ఏర్పాటు చేసి తీరంలో పహారా కాస్తున్నామని మభ్యపెడుతున్నారని గత వారంలో కూడా సోనాబోట్లు తీరానికి దగ్గరగా వేట సాగించాయని, తమపై తమిళనాడు జాలర్లు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సోనాబోట్లను అడ్డుకునేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలు కొంతమేర కృషి చేశాయని, కానీ ప్రస్తుత పెద్దలు మాత్రం ఎంతసేపటికీ మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో అధికార పార్టీకి బుద్ధి చెబుతామని వారు హెచ్చరిస్తున్నారు. ఆ బోట్లను వదిలేయడంతో తిరిగి దాడులు చేస్తున్నారని వాపోతున్నారు. వేట విరమం సమయం ప్రారంభం కావడంతో మత్స్యకారులు పడవలు, వలలను తీరానికి చేర్చారు. తీరానికి లంగరు వేశారు.

సముద్రంలో వేట నిషేధం గంట మోగింది. అయినా మత్స్యకార భరోసా లబ్ధిదారులు జాబితా సిద్ధం కాలేదని జాలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం లబ్ధిదారులు జాబితా అధికారులు సిద్ధం చేసేదెప్పుడో.. మాకు డబ్బులు విడుదల అయ్యేదెప్పుడో అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు మాత్రం ఈనెలాఖరుకు సిద్ధం చేస్తామని చెబుతున్నారు. అయితే మత్స్యకారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేదెప్పుడు ఆ జాబితాను అధికారులు పరిశీలించేందుకు ఎంత సమయం పడుతుంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ సిద్ధమయ్యే నాటికి వేట విరామ సమయం కూడా ముగిసిపోతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వేట నిషేధకాలం రాకమునుపే సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మూడు రోజులుగా చేపల వేటకు వెళ్లలేదని మత్స్యకారులు చెప్తున్నారు. ఈ సారి కాలయాపన చేయకుండా భరోసాను వెంటనే విడుదల చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement