నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతితో తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు బాగా చదువుకోవాలని ఇంటి వద్ద వదిలెళ్తే..శాశ్వతంగా దూరమయ్యాడు గుండెలు బాదుకుంటూ రోదించిన మృతుడు శశికుమార్ తల్లిదండ్రులు మృతుల కుటుంబ సభ్యుల వేదన చూసి ఎమ్మెల్యే తాటిపర్తి కంటతడి మానవత్వం చాటుకున్న పోలీసులు
యర్రగొండపాలెం: ‘‘నా కుమారుడు బాగా చదువుకోవాలని ఇంటి దగ్గర వదిలి మేము మిరప కోతలకు వెళ్లాం.. చివరకు మాకు శాశ్వతంగా దూరమయ్యాడు’’ అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మండలంలోని చిన్నబోయలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కొమ్ము శశికుమార్(12), బోయలపల్లి దీపన్(10)లతోపాటు మరో ఇద్దరు చిన్నారులు బంటు, రోహన్‌లు మంగళవారం పాఠశాలకు సెలవు కావడంతో సరదాగా తమ కాలనీకి సమీపంలో ఉన్న అరటి తోట వద్దకు వెళ్లారు. ఆ తోటలో తిరుగుతున్న సమయంలో కాళ్లకు బురద అంటుకోవడంతో దానిని శుభ్రం చేసుకునేందుకు ఆ చిన్నారులు నీటి కుంట వద్దకు వెళ్లారు. అక్కడ శశికుమార్, దీపన్‌లు కాళ్లు కడుక్కుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి ఆ కుంటలోపడి మునిగి మృతి చెందారు. దాదాపు రెండు నెలల క్రితం చదువుకుంటున్న శశికుమార్‌ను తన జేజయ్య వద్ద వదిలిపెట్టి తల్లిదండ్రులు కొమ్ము బొల్లి కొండయ్య, పెద్దమరికుమారి మిరప కోతల కోసం పల్నాడు జిల్లా గురజాల మండలంలోని దయిదకు వెళ్లారు. పెద్దకుమారుడు పెద్దారవీడు మండలంలోని వైడీపాడులో హాస్టల్‌లో ఉంటూ 7వ తరగతి చదువుకుంటున్నాడు. మరో చిన్న కుమార్తెను తమ వెంట తీసుకొని వెళ్లారు. తమ కుమారుడు నీట మునిగాడన్న సమాచారం తెలుసుకున్న వారు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి పేరుతీసుకొని వస్తాడన్న ఆశతో ఉన్న వారికి విగతజీవిగా కనిపించడంతో తల్లడిల్లిపోయారు. తాము పడుతున్న కష్టం తమ పిల్లలకు రాకూడదని, వారు పెద్ద చదువులు చదవాలన్న ఉద్దేశంతో తమ పిల్లలను పనికి పిలుచుకొని వెళ్లకుండా బడిలో చేర్పించామని వారు గుండెలు బాదుకుంటూ కూలబడితే ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరంకాలేదు.
ఒక్కగానొక్క కుమారుడు కనిపించని లోకాలకు వెళ్లాడు..
ఒక్కగానొక్క కుమారుడు కనిపించని లోకాలకు వెళ్లాడని తెలిసిన దీపన్ తల్లిదండ్రులు బోయలపల్లి మరియదాసు, ఎస్తేరు కన్నీరు మున్నీరయ్యారు. ఆ ఇంటికి దీపన్ పెద్ద కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. దీపన్ మృతిని వారు తట్టుకోలేక ఆ దేవుడు మా ఇంటి దీపాన్నే ఆర్పేశాడని, ఇంకా తాము బతికేదెట్లా అంటూ రోదించారు. వారు ఒక సందర్భంలో స్పృహతప్పి పడిపోయారు. తాము కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా తమ కుమారుడు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని యర్రగొండపాలెంలోని ఒక ప్రైవేటు స్కూల్‌లో చేర్పించామని వారు ఆవేదన చెందారు.
ఎమ్మెల్యే తాటిపర్తికి కంటతడి పెట్టించిన రోదనలు
నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు శశికుమార్, దీపన్‌లు మృతి చెందారన్న సమాచారం అందుకున్న ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరారు. అక్కడ మార్చురీ వద్దకు వెళ్లి చిన్నారుల మృతదేహాలను చూసిన ఆయన తీవ్రంగా కలతచెందారు. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలకు ఎమ్మెల్యే కళ్లు చెమర్చటం కనిపించింది. వెనువెంటనే ఆయన అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి ఆ చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
మానవత్వం చాటుకున్న పోలీసులు
పోలీసులు మానవత్వం చాటుకున్నారు. చిన్నారులు నీట మునిగిన సమాచారం అందుకున్న సీఐ అజయ్ కుమార్, ఎస్సై దేవ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిన్నారులను వెంటనే బయటికి తీస్తే బతికే అవకాశం ఉందన్న ఆశతో సీఐ క్షణం ఆలస్యం చేయకుండా నీటి కుంటలో దిగి చిన్నారులను వెతకడం మొదలు పెట్టారు. ఆ స్ఫూర్తితో గ్రామస్తులు కొంతమంది కుంటలో దిగి గాలింపు చేపట్టారు. చిన్నారులను నీటిలో నుంచి బయటికి తీసిన వెంటనే వారిని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొని వచ్చి పరీక్షలు చేయించారు. అయితే అప్పటికే చిన్నారులు మృతి చెందారని డాక్టర్లు నిర్ధారించడంతో పోలీసులు తీవ్రంగా కలతచెందారు.


