అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి

వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న చెవిరెడ్డి, వెంకాయమ్మ, చుండూరి, బత్తుల, పార్టీ నాయకులు

ఒంగోలు సిటీ: సువిశాల భారతావనికి, ప్రజాస్వామ్య లౌకిక దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయసాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. ఆయన స్ఫూర్తితో మా పార్టీ పని చేస్తుందని చెప్పారు. మహనీయుడు అంబేడ్కర్‌ బాటలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడుగుల సంక్షేమానికి కృషిచేశారన్నారు. నగరంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు జి.దేవప్రసాద్‌ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, బత్తుల బ్రహ్మానందరెడ్డి, చుండూరి రవిబాబు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయాలను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని, పేద బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన పాటు పడ్డారని అన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విజయవాడలో అంబేడ్కర్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, అలాగే పేదల సంక్షేమానికి జగన్‌ నిరంతరం కృషి చేశారని చెప్పారు. సమ సమాజ స్థాపనకు భారతరత్న అంబేడ్కర్‌ పాటు పడ్డారని ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అత్యుత్తమ స్థానంలో ఉంచిందని ఒంగోలు అసెంబ్లీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.ఆదెన్న, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మాదాసి వెంకయ్య, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు టౌన్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గోపిచంద్‌, ఒంగోలు నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు రమణయ్య, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి యరిజర్ల రమేష్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, వైఎస్సార్‌ సీపీ నాయకులు యోహాను, కరుణాకరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement