ఈ ఏడాది మత్స్య సంపద అంతంత మాత్రంగా పడింది. పది నెలల పాటు వేట సాగితే వాతావరణం అంతగా అనుకూలించలేదు. వరుసగా తుఫాన్లు సంభవించడం, సముద్రం అలలు ఎగిసిపడి బోట్లు సముద్రంలోనికి వెళ్లడానికి వీలుకుదరకపోవడం, మోంథా తుఫాన్‌కు వేట సాగక అప్పుల పాలయ్యాం. ప్రభుత్వం ఈ ఏడాది మత్స్యకారులను ఆదుకోవాలి. మత్స్యకార భరోసా జాబితాను ఇంత వరకు తయారు చేయలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. విరామ సమయంలో సబ్సిడీ లోన్లు ఇస్తే వలలు కొనుగోలు చేసి తయారు చేసుకుంటాం. మత్స్యకారులను ఆదుకోవాలని కోరుకుంటున్నా.
– రాసాని మీరాసాహెబ్, కొత్తపట్నం
విరామ సమయంలోనే మత్స్యకార భరోసా ఇవ్వాలి
ప్రభుత్వం 61 రోజులు పాటు విరామ సమయం ప్రకటించింది. ఎండా కాలం కనుక ఎటువంటి పనులు ఉండవు. వేటకు వెళ్లే మత్స్యకారులు వేరొక పనులు చేసుకునే పరిస్థితి ఉండదు. నాకు బోటు ఉంది. బోటులో ఆరుగురు కళాసులు ఉంటారు. వారికి పది నెలలు పాటు ఉపాధి కల్పిస్తాను. వేట లేదు కనుక విరామ సమయంలో మత్స్యకార భరోసా ఇస్తే ఉపయోగంగా ఉంటుంది. ఇంత వరకు మత్స్యకారులను గుర్తించలేదు. ఎంత మందికి ఇస్తారో తెలియదు. త్వరగా జాబితా తయారు చేసి మత్స్యకార భరోసా వెంటనే ఇవ్వాలి.
– పీతా తిరుపాలు, కొత్తపట్నం


