చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతపై కక్ష కట్టింది. సాగు ప్రారంభం నుంచి పంట అమ్మకం వరకు ఏ దశలోనూ అన్నదాతకు అండగా ఉండటం లేదు. ఫలితంగా రైతులు పంటను నష్టానికి దళారులకు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంటలు సాగు చేసే రైతులకు చివరకు నష్టాలే మూటగుట్టుకుంటున్నారు.
బేస్తవారిపేట:
చంద్రబాబు పాలనలో సాగుకు ప్రోత్సాహం అందడం లేదు. ఎన్నికల సమయంలో అది చేస్తాం ఇది చేస్తామంటూ కల్లబొల్లి హామీలిచ్చిన బాబు..అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఫలితంగా పంటలకు గిట్టుబాటు ధరలు కరువై రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. ఈ ఏడాది మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పెరిగిన సాగు విస్తీర్ణం..
మొక్కజొన్న పంట తక్కువ సమయంలో పంట చేతికందుతుంది. 110 నుంచి 130 రోజుల్లో పంట అందుబాటులోకి వస్తుంది. గత ఏడాది రైతులు పండించిన ఏ పంటలకు సరైన గిట్టుబాటు ధర అందలేదు. తెగుళ్లతో పంటలు చేతికందలేదు. రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న సాగు చేసిన రైతులు కొంతమేర ఉపశమనం పొందారు. దీంతో ఈ ఏడాదిలో మొక్కజొన్న సాగుపై రైతులు దృష్టి పెట్టారు. సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల్లో 4752 హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగు చేయాల్సి ఉండగా 19,052 హెక్టార్లలో సాగు చేశారు.
మద్దతు ధరకు మంగళం
క్వింటా మొక్కజొన్నకు గతంలో రూ.2400 మద్దతు ధరగా ఉండేది. కానీ జిల్లాలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతుల బాధ వర్ణణాతీతం. ఎలాంటి కొనుగోలు కేంద్రాలు, మార్కెట్, రవాణా చర్యలు చేపట్టకపోవడంతో వ్యాపారులు అడిగిందే అన్నట్లుగా పరిస్థితి మారింది. చివరకు వ్యాపారులకు క్వింటా రూ.1600–రూ.1700కు విక్రయించుకునే పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో క్వింటా రూ.2500 వరకు ధర పలికింది. అప్పటితో పోల్చుకుంటే ధర మరికొంత పెరగాల్సి ఉంది.
భారీగా పెరిగిన పెట్టుబడి ఖర్చులు
ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి ఖర్చులు అయ్యాయి. వీటికి తోడు మొక్కజొన్న కంకులు కోసేందుకు ఎకరాకు రూ.2500 నుంచి రూ.3 వేలు ఖర్చవుతుంది. మిల్లు ఆడించేందుకు మరో రూ.3 వేలు ఖర్చవుతుంది. ఇక కౌలు రైతులైతే అదనంగా ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు కౌలు చెల్లించాల్సి వస్తోంది. పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీతో పాటు కౌలు చెల్లించాల్సి రావడంతో దళారులు అడిగిన రేటుకు రైతులు తెగనమ్ముకుంటున్నారు.
పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు:
ఏడు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా. అకాల వర్షాలు, వడగండ్ల వానకు పొలంలోని మొక్కలన్నీ నేలకొరిగాయి. కోత కోసేందుకు మిషన్ కూడా రావడం లేదు. రైతులందరిదీ ఇలాంటి పరిస్థితే. కూలీల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.
– కంకర వెంకటరెడ్డి, ఆర్ కొత్తపల్లె.
నష్టాలు మిగిల్చిన మొక్కజొన్న సాగు
గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం
నష్టానికి దళారులకు తెగనమ్ముకుంటున్న రైతులు
అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతులు
పెరిగిన సాగు, కోత ఖర్చులు


