వృద్ధురాలు సజీవ దహనం | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలు సజీవ దహనం

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

ఒంగోలు టౌన్‌:

రాత్రి తల్లి, కుమారుడికి మధ్య వాదన జరిగింది. తెల్లవారేసరికి ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలు మంటల్లో కాలి సజీవ దహనమైంది. స్థానికుల కథనం ప్రకారం... ఒంగోలు నగరంలోని గద్దలగుంట రామాలయం వీధిలో అచ్చికాల వెంకట రమణమ్మ అనే వృద్ధురాలు పెద్ద కుమారుడు వెంకట కిషోర్‌ బాబుతో కలిసి జీవిస్తోంది. భర్త వెంకట రమణయ్య ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ చాలా ఏళ్ల క్రితమే గుండెపోటుతో మరణించారు. చిన్న కుమారుడు వెంకట నారాయణ చైన్నెలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరి స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలి కాగా కొంత కాలం క్రితం సింగరాయకొండలో, అక్కడి నుంచి ఏడాదిన్నరగా ఒంగోలులోని గద్దలగుంటకు వచ్చి ఉంటున్నారు. పెద్ద కుమారుడు కిషోర్‌ బాబుకు వివాహమైంది. అతడికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కిషోర్‌బాబు తల్లి వెంకట రమణమ్మ (80)తో కలిసి జీవిస్తున్నాడు. అయితే తరుచూ తల్లితో గొడవ పడడం, చేయిచేసుకోవడం చేస్తున్నాడు. సోమవారం రాత్రి కూడా తల్లితో గొడవపడ్డాడు. ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారుజాము 5.30 గంటల సమయంలో ఇంట్లోంచి మంటలు వచ్చాయి. ఇంటి బయట కిషోర్‌ కేకలు వేస్తూ కనిపించాడు. నిద్రలోంచి తేరుకున్న ఇరుగు పొరుగు జనాలు కిషోర్‌ను ఏం జరిగిందని ప్రశ్నించారు. అమ్మ మంటల్లో కాలిపోతుందని చెప్పిన అతడు అక్కడ నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు. అప్పటికే వెంకట రమణమ్మ మంటల్లో మాడి మసైపోయింది. ఇళ్లంతా మంటలకు ఆహుతైపోయింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఒన్‌టౌన్‌ పోలీసులు వెంకట రమణమ్మ మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. చైన్నె నుంచి వచ్చిన చిన్న కుమారుడు వెంకట నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద కుమారుడు కిషోర్‌బాబు తరచుగా తల్లితో గొడవ పడుతుండడం, సోమవారం రాత్రి కూడా తల్లితో ఘర్షణకు దిగడం, ఘటన జరిగిన తరువాత పారిపోవడంతో కుమారుడే నిప్పు పెట్టి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి సీఐ నాగరాజును వివరణ అడుగగా వెంకట రమణమ్మ చిన్న కుమారుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని తెలిపారు. తల్లితో కలిసి ఉంటున్న పెద్ద కుమారుడు కిషోర్‌ బాబు ఈ ఘటన జరిగిన తరువాత పారిపోయాడని, అతడు పోలీసులకు దొరికితే ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. ఈ ఘటన ఒంగోలు నగరంలో సంచలనం సృష్టించింది.

మంటల్లో సజీవ దహనమైన

వెంకట రమణమ్మ (ఫైల్‌)

మంటల్లో కాలిపోతున్న ఇల్లు

కన్నకొడుకే నిప్పు పెట్టినట్లు స్థానికుల అనుమానాలు

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

Advertisement
 
Advertisement
Advertisement