కులం లేని సమాజం కోసం అంబేడ్కర్‌ పోరాటం | - | Sakshi
Sakshi News home page

కులం లేని సమాజం కోసం అంబేడ్కర్‌ పోరాటం

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

యర్రగొండపాలెం:

కులంలేని సమాజం కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తన చివరిశ్వాస వరకు పోరాడారని, చదువులే దేశాభివృద్ధికి పాటుపడతాయని భావించిన గొప్ప వ్యక్తి అని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక(జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు దళిత నాయకుడు సింగా ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ నాటి పరిస్థితులను గమనంలోకి తీసుకొని అంబేడ్కర్‌ దళితుల కోసం అనేక పోరాటాలు చేశారని, ప్రపంచం మెచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించి సమసమాజం కోసం కృషి చేశారని అన్నారు. ఏపీలో కారంచేడు, నీరుకొండ, చుండూరులలో దళితులను ఊచకోతలు కోసిన సంఘటనలు చూశామని, ఈ సంఘటనలు అన్నీ ఏ ప్రభుత్వంలో జరిగాయో గమనించాలని ఆయన అన్నారు. అటువంటి రాష్ట్రంలో దివంగత వైఎస్‌.రాజశేఖరరెడ్డి దళితులను గౌరవించి, ప్రభుత్వంలో భాగస్వాములు చేసి, చట్టసభలకు పంపించారని, పంటపై, చదువులపై, ఉద్యోగంపై హక్కు కల్పించారన్నారు. ఆ పంథానే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంచుకున్నారని, రాష్ట్రం నడిబొడ్డులో అత్యంత ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయనకు దళితుల పట్ల ఉన్న గౌరవాన్ని చూపిస్తుందన్నారు.

దళితులు అయిన వారు చర్చిలకు వెళ్లి క్రిస్టియానిటీని తీసుకుంటే వాళ్లను దళిత క్రైస్తవులుగా, ఎస్సీలుగా ఉంచే బాధ్యత నాది అని ప్రస్తుతం రాష్ట్రంలో పెత్తనం చెలాయిస్తున్న చంద్రబాబు మూడు ఎన్నికల్లో చెప్పాడని, తన మ్యానిఫెస్టోలో కూడా పెట్టాడని, కానీ ఆ విషయం గురించి ఎక్కడా మాట్లాడటంలేదని ఆయన విమర్శించారు. రాజ్యసభ సీట్లు కూడా తన వర్గీయులకే కేటాయిస్తున్నారని, అటువంటి పరిస్థితి జగన్‌మోహన్‌రెడ్డి కల్పించలేదని అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఎస్టీలు తమ సంఘ భవనం నిర్మించుకోవటానికి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కేటాయించిన స్థలాన్ని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకోవటానికి కేటాయిస్తున్నారని తెలిసిందని, అటువంటి పరిస్థితి లేకుండా ఎస్టీ భవన్‌ నిర్మాణానికే కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ భవన్‌ నిర్మించుకోవటానికి స్థల సేకరణ కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముందుగా స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి ఆయన నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఓబులరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కందూరి కాశీవిశ్వనాథ్‌, తెలంగాణ ప్రజా గాయకుడు చుక్క రామనరసయ్య, దళిత నాయకులు సీహెచ్‌ విజయభాస్కర్‌, బి.వెంకటేశ్వర్లు, ఎం.బాలగురవయ్య, తోకల ఆవులయ్య, వెంకటేశ్వర్లు నాయక్‌, జబీవుల్లా, ఉప్పలపాటి రమేష్‌, ఆరుణాబాయి, రాములు నాయక్‌, వైఎస్సార్‌ సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

దళితులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసింది వైఎస్సార్‌

తండ్రి పంథాలో నడిచిన జగనన్న

ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement