మత్స్యకారులకు భరోసా కల్పించటంలో
సింగరాయకొండ: మత్స్యకారులకు భరోసా కల్పించటంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వారికి భరోసా కల్పించడమే జగనన్న జువ్వలదిన్నె పర్యటన ముఖ్య ఉద్దేశమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న జువ్వలదిన్నెకు ఎందుకు వస్తున్నాడో తెలపాలని మంత్రి స్వామి అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశలో వారిని ఆర్థికంగా పరిపుష్టి చేసే అంశంలోను, వారికి జీవనోపాధులు కల్పించి భరోసా ఇవ్వటంలోను పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. సోనాబోట్ల నుంచి భద్రత కల్పించటంలో విఫలమైందని, తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన సోనాబోట్లు నాలుగు జిల్లాల మత్స్యకారుల పొట్టకొడుతుంటే కాపాడలేని స్థితిలో ఉన్న ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన అని అన్నారు. తీరంలో అక్రమంగా వేట సాగిస్తున్న సోనాబోట్లను మత్స్యకారులు నిర్బంధిస్తే వారికి అండగా ఉండాల్సిన అధికార పార్టీ నాయకులు ఆర్థిక స్వలాభం కోసం డబ్బుకు లొంగి వాటిని విడిపించారన్నారు. అందులో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీ రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్‌రావు, ఇతర నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీ సముద్ర నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఆ నిబంధనల ప్రకారం మత్స్యశాఖ, రెవెన్యూ, నేవి, కోస్ట్‌గార్డు, కోస్టల్ ప్రొటెక్షన్ మధ్య సమన్వయం కల్పించేలా నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సోనాబోట్లు అక్రమంగా ప్రవేశించకుండా తీరప్రాంత గస్తీని పెంచాలన్నారు. వేట నిషేధకాలంలో బే షరతుగా అన్ని రోజులకు నష్టపరిహారం, పెండింగ్ బకాయిలు చెల్లించాలన్నారు. మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి, సుస్థిరమైన జీవనోపాధులు కల్పించటంలో కృషి చేయాల్సింది పోయి వీటన్నింటినీ విస్మరించిన మంత్రి స్వామి, ప్రోటోకాల్ అనుభవిస్తూ కాలం గడుపుతున్న మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఇద్దరూ మత్స్యకారులను గాలికొదిలేశారని ఆరోపించారు. జువ్వలదిన్నె హార్బర్ 2004 లో వైఎస్సార్ హయాంలో మంజూరైందని, దీనిపై చర్చకు సిద్ధమని సురేష్ ప్రకటించారు. మత్స్యకారుల ఓట్లతో గెలిచి మంత్రి పదవి అనుభవిస్తున్న మంత్రి స్వామి ఈరోజు మత్స్యకారుల బాగోగులు పట్టించుకోకపోవటం దారుణమని, ఇందుకు నైతిక బాధ్యతగా తక్షణమే రాజీనామా చేయాలని సురేష్ డిమాండ్ చేశారు. జగనన్న రాకతో మత్స్యకారులకు ఓదార్పు కలుగుతుందని, వారికి పూర్తి భరోసా కల్పిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మత్స్యకారులకు భరోసా ఇచ్చేందుకే జగన్ పర్యటన
మత్స్యకారులకు అండగా నిలబడని మంత్రి స్వామి రాజీనామా చేయాలి
మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్


