మార్కాపురం టౌన్: కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏకలవ్య కాలనీలో జరిగింది. కాలనీలో నివాసముండే షేక్ మహబూబ్ సుభానీ (34) చికెన్ కొట్టు పెట్టుకుని జీవిస్తున్నాడు. సోమవారం రాత్రి మద్యంతాగి భార్యతో గొడవ పెట్టుకోగా ఆమె పక్క బజారులో ఉండే పుట్టింటికి ముగ్గురు పిల్లలను తీసుకువెళ్లింది. మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంటికి వచ్చిచూడగా భర్త మహబూబ్ సుభానీ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించింది. మృతుని భార్య ఇమాంబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణఎస్సై సైదుబాబు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్వగ్రామం గుంటూరులోని నల్లచెరువు కాగా ఇక్కడికి వచ్చి నివాసముంటున్నాడు.
మద్దిపాడు: మండలంలోని ఏడుగుండ్లపాడు సమీపంలో ఉన్న ఐచర్ షోరూం ఎదురుగా జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మద్దిపాడు ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించిన వ్యక్తి లారీ డ్రైవర్ గానీ క్లీనర్ గానీ అయి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.
టంగుటూరు:
కారులో తరలిస్తున్న 7 కిలోల గంజాయిని ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపునకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఈగల్ టీం బృందం టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో కారులో గంజాయిని గుర్తించి వాహనాన్ని పరిశీలించగా 7 కిలోల గంజాయి లభ్యమైంది. కారులో ఉన్న ఐదుగురిని, కారుని అదుపులోకి తీసుకొని టంగుటూరు ఇన్‌చార్జి ఎస్సై మహేంద్రకు అప్పగించారు. అనంతరం యువకులను, గంజాయిని సింగరాయకొండ సీఐ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.


