గత నెల చివర్లో కురిసిన వడగండ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏపుగా పెరిగిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఒక బేస్తవారిపేట మండలంలోనే 450 హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. పండించిన పంట చేతికందె దశలో మొక్కజొన్న పంట నేలపాలైంది. వారం రోజుల్లో కోత కోయాల్సిన పంట నేలపాలై రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. రెండు నెలల మొక్కజొన్న పంట బలమైన గాలులు, వడగడ్లకు విరిగిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత రెండేళ్లుగా పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్, ఇన్‌ఫుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం కానీ ప్రభుత్వం అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలకొరిగిన మొక్కజొన్న కంకులను మిషన్లతో తీసే పరిస్థితి లేకుండాపోయింది. కూలీల కొరత వేధిస్తుంది. రోజుకు ఒక్కో కూలీకి రూ.800 పెట్టి కంకులు కోయాల్సిన పరిస్థితి తలెత్తడంతో పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


