అక్షరం చిగురుటాకై ! | - | Sakshi
Sakshi News home page

అక్షరం చిగురుటాకై !

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

చదువుల కోవెలల్లో బాలికలకు రక్షణ కరువు

ఉమ్మడి జిల్లాలో ఏకంగా 16 కేసులు నమోదు

పోక్సో కేసుల్లో నిందితులకు అండగా నిలుస్తున్న పచ్చనేతలు

అధికార పార్టీ ఒత్తిళ్లతో కీచక ఉపాధ్యాయుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు

చంద్రబాబు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటోన్న బాధితులు

విద్యార్థుల భవిష్యత్‌కు బంగరు బాటలు వేసే గురువులు కీచకులుగా మారుతున్నారు. పసిబిడ్డల దేహాలను తమ వికృత కోరికలకు బలిచేస్తూ, ఉపాధ్యాయ వృత్తికే వాళ్లు కళంకం తెస్తున్నారు. విద్యావనంలో కలుపు మొక్కలుగా మారుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలోని సర్కార్‌ పాఠశాలల్లో బాలికలపై లైంగిక దాడి ఘటనలు 16 చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కీచకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిపోయి మొక్కుబడిగా సస్పెండ్‌ చేసి తిరిగి పోస్టింగ్‌లు ఇచ్చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నెం పుణ్యం ఎరుగని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడుతున్న వారికి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా నిలబడడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలు అఘాయిత్య కేంద్రాలుగా మారడంతో బాలికలు సర్కార్‌ స్కూళ్లకు వెళ్లాలంటే భయపడిపోయే పరిస్థితి.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికలపై లైంగిక దాడులు పెచ్చుమీరిపోయాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 16 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. జిల్లాలో అత్యధికంగా కురిచేడు మండలంలో 6, సింగరాయకొండ మండలంలో 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక్క సింగరాయకొండ మండలంలోనే నలుగురు ఉపాధ్యాయులపై పోక్సో కేసులు నమోదయ్యాయి. అలాగే అర్ధవీడు, కొనకనమిట్ల, కనిగిరి, మద్దిపాడు, టంగుటూరు, పొన్నలూరు తదితర మండలాల్లోని స్కూళ్లలో విద్యార్థినులపై టీచర్లు అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. గతంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన తమ బిడ్డ స్కూలుకు వెళ్లి చదువుకుంటుందన్న భరోసాతో తల్లిదండ్రులు ధైర్యంగా ఉండేవారు. ఇప్పుడు పాఠశాలకు వెళ్లిన తమ బిడ్డకు ఏం జరుగుతుందోనన్న దిగులుతో వణికిపోతున్నారు.

బాధిత కుటుంబాలపై ఒత్తిడి...

ఎలాంటి సిగ్గు ఎగ్గూ లేకుండా చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడిన ఉపాధ్యాయులు బాధిత కుటుంబాలపై ఒత్తిడి చేస్తున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఘటన జరిగిన తరువాత నామమాత్రంగా విచారణ జరుపుతున్న విద్యాశాఖ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. ఈలోపు బాధితులతో రాజీ చేసుకునేందుకు పచ్చ ముఠా రంగంలోకి దిగుతోంది. పాలక జెడ్పీ హైస్కూల్లో జరిగిన ఉదంతాన్ని ఇందుకు నిదర్శనంగా చూపవచ్చు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను పోక్సో కేసులో అరెస్టు చేశారు. దాంతో విద్యాశాఖ వారిని సస్పెండ్‌ చేసింది. మరో టీచర్ని బదిలీ చేసింది. అయితే బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చిన కీచక ఉపాధ్యాయుడు తనను వేధించలేదని ఒక లెటర్‌ రాయించుకొని మరీ తీసుకొచ్చాడు. ఇది జరిగిన కొన్ని నెలల తరువాత తప్పుడు కేసుగా కొట్టివేసేందుకు బాధిత కుటుంబాన్ని కోర్టులో హాజరుపరిచారు. ఎవరూ ఊహించని విధంగా కోర్టులో కూడా సదరు విద్యార్థిని సదరు ఉపాధ్యాయుడు తనను లైంగికంగా వేధించినట్లు చెప్పింది. దాంతో ఉపాధ్యాయుడిని అరెస్టు చేయక తప్పలేదు. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు.

నేరం చేసిన ఉపాధ్యాయుడు కోరిన చోట పోస్టింగ్‌...

సాధారణంగా ఒక ఉపాధ్యాయుడు నేరం చేసినప్పుడు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్‌ చేయడం మామూలే. సదరు ఉపాధ్యాయుడికి మళ్లీ పోస్టింగు ఇచ్చే సమయంలో పాత స్కూలులో పోస్టింగు ఇవ్వకూడదని నిబంధనలున్నాయి. కేసుపై ప్రభావం చూపకుండా సదరు ఉపాధ్యాయుడిని కేటగిరీ 4 పాఠశాలలకు బదిలీ చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ నిబంధనలను తుంగలోకి తొక్కుతోంది. పోక్సో లాంటి తీవ్రమైన నేరాలలో అభియోగాలు అనుభవిస్తున్న వారికి కోరిన చోటకు పోస్టింగులు ఇవ్వడంపై ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. జిల్లాలో ఒకరిద్దరు ఉపాధ్యాయులకు పాత పాఠశాలకే రీ పోస్టింగు ఇచ్చినట్లు తెలుస్తోంది. పోక్సోతో పాటుగా వివిధ కారణాలతో సస్పెండ్‌ అయిన వారికి తిరిగి పోస్టింగులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మద్దిపాడు మండలం వెల్లంపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న సస్పెండ్‌ అయిన ఒక ఉపాధ్యాయుడికి తిరిగి అదే స్కూల్లో పోస్టింగు ఇచ్చినట్లు సమాచారం. కనిగిరి జిల్లా పరిషత్‌ హైస్కూలులో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు 2025, మార్చి 23న సస్పెండ్‌ కాగా సీఎస్‌పురం జెడ్పీ హైస్కూల్లో పోస్టింగు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెల్లపాడు జెడ్పీ హైస్కూలులో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయగా పాకల జెడ్పీ హైస్కూలులో పోస్టింగు ఇచ్చారు. టంగుటూరు మండలం కారుమంచిలో స్కూలు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అధికార టీడీపీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయుడిని 38 రోజులు తిరగకుండానే కొత్తపట్నం మండలం ఈతముక్కలలో పోస్టింగు ఇచ్చారు. సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం ఫిజికల్‌ డైరక్టర్‌ను సస్పెండ్‌ చేసి తిరిగి ఉలవపాడు మండలం రామాయపట్నం జెడ్పీ హైస్కూలులో పోస్టింగు ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో మహిళలకు రక్షణ కల్పిస్తామంటూ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌ గొప్పలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచిపోయారని, అధికార పార్టీ నాయకులే కీచకులకు ఎలా అండగా నిలుస్తారని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కీచక ఉపాధ్యాయులకు టీడీపీ నేతల అండ...

ఆడపిల్లలకు ఏదైనా జరిగితే వారికి అదే చివరి రోజవుతుందని ఎన్నికలకు ముందు గొప్పలు చెప్పిన కూటమి నాయకులు గెలిచి గద్దెనెక్కిన తరువాత నిందితులకు అండగా నిలవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైంగిక దాడులకు పాల్పడిన ఉపాధ్యాయులపై కేసు నమోదు చేయకుండా చివరి నిమిషం వరకు అడ్డుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ కేసు నమోదు దగ్గర నుంచి టీచర్‌ సస్పెన్షన్‌, రీ పోస్టింగు వరకు ప్రతి దశలోనూ టీడీపీ ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారు. ఏకంగా మంత్రులు సైతం కీచక ఉపాధ్యాయులకు సాయపడుతున్నట్లు ఆరోపణలు రావడం గమనార్హం. పాలకవర్గ ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో విద్యాశాఖ అధికారులు కీచక ఉపాధ్యాయుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చిన్నారులపై కన్నేస్తున్న టీచర్లు

Advertisement
 
Advertisement
Advertisement