సెలవులో కమీషనర్‌! | - | Sakshi
Sakshi News home page

సెలవులో కమీషనర్‌!

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

వేటు తప్పదని భావించి ఆఘమేఘాలపై దరఖాస్తు అధికార పార్టీ అండతో క్షణాల్లో మంజూరైన సెలవు అవినీతిపై వరుస కథనాలు ప్రచురించిన ‘‘సాక్షి’’

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఒంగోలు నగరపాలక సంస్థ అక్రమాలకు, అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతిపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచరితమయ్యాయి. ఏడాదిన్నర కాలంగా జరిగిన లూటీని వెలుగులోకి తెచ్చింది. అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండడంతో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని, తనపై వేటు తప్పదని భావించిన కమిషనర్‌ వెంకటేశ్వరరావు సెలవుపై వెళ్లిపోయారని తెలిసింది. నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలపై జిల్లా ఉన్నతాధికారులు సైతం దృష్టిసారించారని తెలిసింది. ఈ విషయాన్ని పసిగట్టిన కమిషనర్‌ ఆఘమేఘాలపై నెల రోజులు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. ప్రభుత్వ పెద్దల సపోర్టు ఉండడంతో కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్న క్షణంలోనే సెలవు మంజూరు ఉత్తర్వులు వచ్చాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ పి.సంపత్‌ కుమార్‌ నుంచి వచ్చిన లేఖ ప్రకారం ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఆయన సెలవులో ఉంటారు. ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రస్తుతం అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉన్న రాంభూపాల్‌రెడ్డిని నియమించారు. ఇదిలా ఉండగా కమిషనర్‌ వెంకటేశ్వరరావు ఇప్పటికే రెండు ఏసీబీ విచారణలను ఎదుర్కొంటున్నారు. రెండింటిలోనూ వ్యక్తిగత ఖాతాలకు ఫోన్‌పే ద్వారా చెల్లింపులు కీలకంగా మారాయి. ఈ విషయాలను సైతం ‘సాక్షి’ ప్రచురించింది.

ఇంజినీరింగ్‌ వర్కుల్లోనూ...

నగరంలో నగర పాలక సంస్థ ఇంజినీరింగ్‌ విభాగం తరఫున చేస్తున్న పనులకు 5 శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనని మంకుపట్టు పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు ఈ పనుల్లో వసూలు చేసిన మామూళ్లను అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లకు వాటాలు పంచడంతో పాటుగా ఈ కీలక అధికారి కూడా కమీషన్లు తీసుకునేవాడని సమాచారం.

కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల్లో భారీ అవినీతి...

నగరంలోని కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల అనుమతుల్లో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంగమూరు రోడ్డులోని ఒక కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో దాదాపు కోటి రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. అందులో ముఖ్య అధికారికి రూ.అర కోటికి పైగా అందినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన వీఎల్‌టీ పన్ను, లేబరు పన్నులు కలిపి ఆ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ యాజమాన్యం దాదాపు రూ.7.40 కోట్లు ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. వాళ్లకు తూ..తూ మంత్రంగా నోటీసులు ఇచ్చి రూ.కోటి నొక్కినట్లు కార్పొరేషన్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. చెత్త సేకరణలోనూ పెద్ద అవనీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాం లో చెత్త పన్నుల ద్వారా నెలకు రూ.45 లక్షలు సేకరించి నేరుగా పాలక సంస్థ అకౌంట్‌కు జమ చేసేవారు. అయితే ఇప్పుడు సేకరిస్తున్న చెత్త పన్ను డబ్బులు సైతం కీలక అధికారి ఖాతాకు మళ్లుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గత రెండేళ్లుగా ఈ డబ్బుల లెక్కలు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఎందుకు ఉంచారో దేవుడికే తెలియాలని మున్సిపల్‌ ఉద్యోగులు కొందరు చెబుతున్నారు.

డోర్‌ నంబర్ల కాంట్రాక్ట్‌పై బుకాయింపు..

నగరంలోని ఇళ్లడోర్‌ నంబర్ల ఏర్పాటు కాంట్రాక్ట్‌పై నగరపాలక సంస్థ కమిషనర్‌ విరవరణ ఇచ్చారు. టెండర్లు పిలిచామని, కాంట్రాక్టర్లు ఎవరూ రాలేదన్నారు. దీంతో లోకల్‌ పెయింట్‌, ఆర్ట్‌ వర్క్స్‌ వారి దగ్గర నుంచి కొటేషన్లు స్వీకరించామన్నారు. ఇద్దరి దరఖాస్తు చేసుకున్నారని, అందులో తాడేపల్లిగూడెంకు చెందిన క్రాంటాక్టర్‌ తక్కువకు రూ.94.50కు కొటేషన్‌ దాఖలు చేయడంతో ఆయనకు కాంట్రాక్ట్‌ ఇచ్చామని చెప్పుకొచ్చారు. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో డోర్‌ నంబర్లు వేయటానికి చుట్టూ ఫ్రేమ్‌తో కలిపి రూ.70 లకు డిజైన్‌ చేశారు. ప్రభుత్వం మారటంతో అవి ఆగిపోయాయి. డోర్‌ నంబర్లు కాంట్రాక్ట్‌ పొందిన వ్యక్తి ఇప్పటికే నగరంలో డివైడర్లు, బై పాస్‌ బ్రిడ్జి పిల్లర్లు, ప్రధాన రోడ్లపై జీబ్రా క్రాసింగ్‌ పెయింటింగ్‌ పనులన్నీ చేస్తున్నాడు. అయితే ఇలా రంగులు వేయడం, అవి అలా మాసిపోవటం పరిపాటిగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement