కొత్త పుస్తకాలు కొనలేక.. జీతాలు చెల్లించలేక | - | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు కొనలేక.. జీతాలు చెల్లించలేక

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

కొత్త పుస్తకాలు కొనలేక.. జీతాలు చెల్లించలేక

జిల్లాలో రూ.25 కోట్లకు చేరిన గ్రంథాలయాల బకాయిలు ఉమ్మడి జిల్లాలో 66 గ్రంథాలయాలు

మార్కాపురం:

నాడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయాలు అటు పాఠకులకు, ఇటు వివిధ ఉద్యోగాలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు చేరువయ్యాయి. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో గ్రంథాలయాలకు నిధులు ఇవ్వడంతోపాటు కొత్త పుస్తకాలు కొనుగోలు చేయడంతో గ్రంథాలయాలకు వెళ్లేందుకు పాఠకులు క్యూ కట్టారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిధులు కేటాయించకపోగా నూతన పుస్తకాలు కొనుగోలు చేయకపోవడంతో సిబ్బందికి జీతభత్యాలు చెల్లించలేని పరిస్ధితి ఏర్పడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా 66 గ్రంథాలయాలు ఉండగా స్థానిక సంస్థల నుంచి సుమారు రూ.25 కోట్ల బకాయిలు గ్రంథాలయ సంస్థకు రావాల్సి ఉంది. ప్రజల నుంచి స్థానిక సంస్థలు గ్రంథాలయ సెస్‌ వసూలు చేస్తున్నప్పటికీ అవి గ్రంథాలయ సంస్థకు చెల్లించడం లేదు. దీంతో రెండు నెలల నుంచి జిల్లా వ్యాప్తంగా సిబ్బందికి జీతభత్యాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. జిల్లాలోని 66 గ్రంథాలయాల్లో 70,659 మంది సభ్యులు ఉండగా 6,06,607 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఒంగోలుతో పాటు మార్కాపురంలో గ్రేడ్‌–1 గ్రంథాలయం ఉండగా కంభం, కనిగిరి, పర్చూరు, చీరాల గ్రంథాలయాలు గ్రేడ్‌–2గా నమోదై ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25 గ్రంథాలయాలు సొంత భవనాలు, మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

కొత్త పుస్తకాలు లేవు:

త్వరలో గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ వస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులు గ్రంథాలయాలకు వెళ్తే రెండేళ్లనాటి కరెంటు అఫైర్లు, స్పోర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పుస్తకాలు లభ్యమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పుస్తకాలు కొనుగోలు చేయకపోవడంతో గ్రంథాలయాలకు వచ్చే పాఠకుల సంఖ్య తగ్గుతోంది. దిన, వార పత్రిక నెలవారీ బిల్లులు సకాలంలో చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నెల్లూరు గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కూడా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. మార్కాపురం జిల్లాలోని కొమరోలు, అర్ధవీడు, రాచర్ల, ఆకవీడు, పుల్లలచెరువు గ్రంథాలయాలకు శాశ్వత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గ్రామ స్థాయిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 26 గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలని, గ్రంథాలయ ఉద్యోగుల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement