● కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం టౌన్: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టిపెట్టామని, రాబోయే ఆరు నెలల్లో ఈ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ యం.విజయసునీత చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీలను ఆమె స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 90 శాతం రెవెన్యూకు సంబంధించిన అర్జీలే వస్తున్నాయని అన్నారు. 22(ఏ)లో నమోదైన సర్వే నంబర్లను తొలగించాలని ప్రజల నుంచి ఇప్పటి వరకు 450 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. జిల్లాలోని 150 మంది రైతులకు సంబంధించిన భూములను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 22(ఏ) జాబితా నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మొత్తం 165 అర్జీలు రాగా వీటిలో 92 రెవెన్యూ అర్జీలు 73 ఇతర సమస్యలపై అర్జీలు వచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో జేసీ పీ శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు ప్రభాకర్, శివరామిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి బాలూనాయక్, వ్యవసాయశాఖ ఏడీ బాలాజీ నాయక్, ఇన్‌చార్జి ఆర్‌టీఓ రాంబాబు, కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


