ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల్లో కనపర్తి ఎత్తిపోతల పథకం కింద కనపర్తి, వినోదరాయునిపాలెం, దాసరివారిపాలెం, అమ్మనబ్రోలు, దేవరంపాడు గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. సుమారు లక్షా 60 వేల క్వింటాల వరిధాన్యం దిగుబడి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాగాణి రైతులకు వరి ధాన్యం రాసులపై కప్పుకునేందుకు ప్లాస్టిక్ పరదాలు, ధాన్యం నింపుకునేందుకు ఎకరాకు 80 నారగోతాలు అందజేశారు. దాంతో పాటు ఎలాంటి తరుగు, దళారుల ప్రమేయం లేకుండా ఆర్‌బీకేల ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేశారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పైస్థాయిలో ప్రచారాలు, ఆర్భాటాలు మినహా క్షేత్రస్థాయిలో ఆచరిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రజాప్రతినిధులు, అధికారులు చేతులు దులుపుకున్నారు. గిట్టుబాటు ధర గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర క్వింటాకు రూ.2,437 కాగా, ఆ ధర ప్రకారం నామమాత్రంగా 20 నుంచి 25 లారీలు మాత్రమే కొనుగోలు చేసి వదిలేశారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వ్యాపారులు ధరలను భారీగా తగ్గించి క్వింటా వరి ధాన్యాన్ని రూ.1,500 నుంచి రూ.1,600కు కొనుగోలు చేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ధాన్యాన్ని నిల్వ చేసుకోలేక, పెట్టుబడులకు వడ్డీలు కూడా పెరుగుతుండటంతో దిక్కుతోచని స్థితిలో తక్కువ ధరకు తెగనమ్ముకుంటూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా, ఈ సంవత్సరం వరి రైతులకు ప్లాస్టిక్ పరదాలు, నారగోతాలు (గన్నీ బ్యాగులు) కూడా కూటమి ప్రభుత్వం అందజేయలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో 8 నుంచి 10 కేజీల తరుగు తీసివేసి కొనుగోలు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అంతేగాకుండా ధాన్యం బస్తాల తరలింపునకు లారీ ట్రాన్స్‌పోర్టు చార్జీలు కూడా రైతులే భరించాలని చెప్పడం వంటివి అన్నదాతలు, వ్యవసాయం పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. వ్యవసాయానికి సర్కార్ సాయం చేయకపోగా.. రైతులకు నష్టం కలిగించేలా నిబంధనలు విధించడం దారుణమని రైతుల సంఘాల నాయకులు మండిపడుతున్నారు. – సాక్షి, ఒంగోలు
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు
వ్యవసాయం చేసేందుకు కనీస సహాయ
సహకారాలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత వైఎస్సార్ సీపీ
ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్
జగన్‌మోహన్‌రెడ్డి అన్నదాతల కోసం అమలు చేసిన పథకాలన్నింటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక పాడె కట్టింది. ఎన్నికల హామీలను సైతం విస్మరించింది. రైతన్న సంక్షేమాన్ని
తుంగలో తొక్కింది. వ్యవసాయంపై
చంద్రబాబు చేస్తున్న కుట్రలను అధిగమించి మరీ ఆరుగాలం శ్రమించి కష్టనష్టాలకోర్చి అన్నదాతలు పంటలు పండిస్తూనే ఉన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా
వ్యవసాయం చేస్తున్నారు. తమకు తెలిసింది పంటలు పండించడం మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఒంగోలు, నాగులుప్పలపాడు మండలంలోని గ్రామాల్లో సాక్షి కెమెరా క్లిక్‌మనిపించిన ఈ దృశ్యాలే అందుకు నిదర్శనం.


