రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

ఒంగోలు టౌన్‌: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ హర్షవర్థన్‌ రాజు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కలెక్టర్‌ పి.రాజాబాబు సహకారంతో 125 కుంభాకార దర్పణాలు, 150 స్ప్రింగ్‌ పోల్స్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ హర్షవర్థన్‌ రాజు వివరాలు వెల్లడించారు. మార్కాపురం, ప్రకాశం జిల్లాలో బ్లాక్‌ స్పాట్లు, గ్రామాల నుంచి మెయిన్‌ రోడ్లకు వెళ్లే ప్రదేశాలు, ప్రమాదాలకు గురయ్యే మొత్తం 115 ప్రదేశాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో నేషనల్‌ హైవే, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి కన్వెన్షన్‌ మిర్రర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ అద్దాల ద్వారా ప్రమాదకర మలుపుల్లో దూరం నుంచి కనిపించని వాహనాలను ముందుగానే పసిగట్టి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రతలు తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పారు. రోడ్డు ఇంజినీరింగ్‌లో భాగంగా ఒంగోలు నగరంలోని కలెక్టర్‌ కార్యాలయం, నార్త్‌ బైపాస్‌, సౌత్‌ బై పాస్‌, మంగమూరు జంక్షన్‌లతో కలిపి నాలుగు ప్రధాన జంక్షన్ల వద్ద ప్రీ లెఫ్ట్‌ మార్గాల్లో వాహనదారులకు సౌకర్యార్థం స్ప్రింగ్‌ పోల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొత్త నేషనల్‌ హైవే రోడ్డుపై వాహనదారులు, ప్రజలు వేగంగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదం జరిగిన తరువాత బాధపడేకంటే ముందుగానే తగిన జాగ్రతలు తీసుకోవడం మంచిదని సూచించారు. ప్రయాణికుల భద్రతలో భాగంగా ప్రతిరోజూ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. బస్సుల్లో ఫైర్‌ సేఫ్టీ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, అత్యవసర కిటీకీలు, డ్రైవింగ్‌ సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌ వంటి ప్రమాదకర అలవాట్లపై డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. మార్కాపురం, ప్రకాశం జిల్లాలో 2500 ఎల్‌ఈడీ లైట్లను గుర్తించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. మాడిఫైడ్‌ సైలెన్సర్లు, ఎల్‌ఈడి, హై బీమ్‌ లైట్లు వాడకూడదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్‌ వాడాలని, సీట్‌ బెల్ట్‌ ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు సెల్‌ఫోన్లో మాట్లాడరాదని, మైనర్‌ రైడింగ్‌, ట్రిపుల్‌ డ్రైవింగ్‌ చేయరాదని సూచించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవచ్చని చెప్పారు. సమావేశంలో ఎస్‌బీ సీఐ శ్రీనివాసరావు, ట్రాఫిక్‌ సీఐ జగదీష్‌, డీసీఆర్‌బీ సీఐ దేవ ప్రభాకర్‌, ఎస్సై మాల్యాద్రి పాల్గొన్నారు.

ఎస్పీ హర్షవర్థన్‌ రాజు

Advertisement
 
Advertisement
Advertisement