ఒంగోలు టౌన్: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 74 ఫిర్యాదులు అందాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పలువురు బాధితులు ఎస్పీ హర్షవర్థన్‌రాజును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. రాత పూర్వకంగా ఫిర్యాదులు అందించారు. ఆయా ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ.. వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై చట్టపరమైన విచారణ జరిపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వృద్ధులు, మహిళలతో గౌరవంగా ప్రవర్తించాలని, వారు చెప్పే సమస్యలను శ్రద్ధగా వినాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ట్రాఫిక్ సీఐ జగదీష్, గుడ్లూరు సీఐ నరేష్ కుమార్, ప్యానల్ అడ్వకేట్ బాలాజీ సింగ్, వేదిక ఎస్సై జనార్దన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 39 అర్జీలు వచ్చినట్లు డీఎస్పీ డాక్టర్ నాగరాజు తెలిపారు. జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల నుంచి అర్జీదారులు వివిధ సమస్యలపై ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు అందజేశారు. అత్తారింటి వేధింపులు, కుటుంబ కలహాలు, భూ వివాదాలు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు డీఎస్పీ చెప్పారు. అర్జీలపై వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్, ఎస్సైలు, సీఐలకు ఫోన్‌చేసి పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. మార్కాపురం, పామూరు, కంభం సీఐలు సుబ్బారావు, వినోద్‌కుమార్, మల్లికార్జునరావు, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.


