మహిళ పోగొట్టుకున్న బంగారాన్ని అప్పగించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

మహిళ పోగొట్టుకున్న బంగారాన్ని అప్పగించిన పోలీసులు

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

మహిళ పోగొట్టుకున్న బంగారాన్ని అప్పగించిన పోలీసులు

మార్కాపురం టౌన్‌: మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి తిరునాళ్లలో ఓ మహిళ ఆటోలో బ్యాగు మర్చిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెంటనే కనుగొని ఆ బ్యాగును, అందులో ఉన్న బంగారం, నగదును సదరు మహిళకు అప్పగించారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. మార్కాపురం సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమంతునిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన బొమ్మనబోయిన జ్యోతి మార్కాపురంలో లక్ష్మీచెన్నకేశవస్వామి తిరునాళ్లు చూసేందుకు ఇటీవల పట్టణంలోని తన పుట్టింటికి వచ్చింది. తిరునాళ్ల అనంతరం ఆదివారం రాత్రి అత్తగారి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో బయలుదేరి బస్టాండుకు చేరుకుంది. హడావిడిలో తన బ్యాగును ఆటోలో మర్చిపోయింది. బస్టాండ్‌లోకి వెళ్లిన కొద్దిసేపటికి బ్యాగు గుర్తుకొచ్చి ఆటోలో మర్చిపోయిన విషయంపై వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ సుబ్బారావు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఆటోను గుర్తించి డ్రైవర్‌ను స్టేషన్‌కు పిలిపించి బ్యాగు అప్పగించారు. అందులో 15 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.4,200 నగదు, చీరలు ఉండటంతో పోలీసులకు జ్యోతి కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement