పంట నష్టపోయి యువ రైతు ఆత్మహత్యాయత్నం
పెద్దదోర్నాల: వరద తీవ్రతకు సాగులో ఉన్న వ్యవసాయ భూమి అంతా నాశనమైనా అధికారులెవరూ తనను పట్టించుకోలేదన్న ఆవేదనతో ఓ యువ రైతు పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన పెద్దదోర్నాల మండల పరిధిలోని కటకానిపల్లెలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడి బంధువులు అందించిన సమాచారం మేరకు.. కటకానిపల్లి గ్రామానికి చెందిన దూదేకుల రసూల్‌వలి (30) కుటుంబానికి ఫీడర్ కెనాల్ పరిసరాల్లో 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో అతని కుటుంబం మిర్చి పంట సాగుచేస్తోంది. మోంథా తుఫాన్ ప్రభావంతో వెలిగొండ ప్రాజెక్టుకు చెందిన ఫీడర్ కెనాల్‌కు గండి పడింది. దీంతో తీవ్రంగా ప్రవహించిన వరద ధాటికి వీరి పొలం మొత్తం కోతకు గురై కొండరాళ్లతో నిండిపోయింది. పంటలు బాగా పండి తనకున్న రూ.5 లక్షల అప్పు తీర్చేయ వచ్చన్న ఆశతో ఉన్న ఆ యువకుడి ఆశలు అడియాశలయ్యాయి. దిక్కచోచని స్థితిలో రసూల్‌వలి కోతకు గురైన తన పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. గమనించిన బంధువులు అడ్డుకున్నారు. పొలం కోతకు గురై పంట దెబ్బతినడం, అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో తనువు చాలించాలనుకున్నట్లు రసూల్‌వలి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఫీడర్ కెనాల్‌కు గండిపడటంతో
మిర్చి పంట ధ్వంసం
అప్పులతో గత్యంతరం లేని స్థితిలో
ఆత్మహత్యకు ప్రయత్నం
పంట నష్టపోయి యువ రైతు ఆత్మహత్యాయత్నం


