నేటి నుంచి 30 పోలీసు యాక్ట్
ఒంగోలు టౌన్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు ఒంగోలు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సంఘాలు, కార్మిక యూనియన్లు, రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మద్దిపాడు: మండలంలోని గుండ్లాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హ్యాండ్ బాల్ జిల్లా జట్లను శనివారం ఎంపిక చేయనున్నట్లు హ్యాండ్ బాల్ గేమ్ సెక్రటరీ విజయకుమార్ తెలిపారు. అండర్–14 విభాగంలో బాలురు, బాలికల జట్లు, అండర్–17 విభాగంలో బాలికల జట్టును ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు వయసు నిర్ధారణ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని ఆయన సూచించారు.
సింగరాయకొండ: మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న బీకే త్రషర్స్ కంపెనీలో గత నెల 10వ తేదీన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 598 కోట్ల రూపాయల విలువైన పొగాకు, గోడౌన్‌లు దగ్ధమయ్యాయి. ప్రమాద ఘటనకు కారణాలపై శుక్రవారం ఫోరెన్సిక్ నిపుణులు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణాలు పరిశీలించారు. జీపీఐ కంపెనీ ప్రతినిధి రవి, బీకే త్రషర్స్ కంపెనీ మేనేజర్ శ్రీనివాసరావు, ఎస్సై మహేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.


