వైఎస్సార్ విగ్రహంపై దుశ్చర్య
నాగులుప్పలపాడు: మండలంలోని ఉప్పుగుండూరు గ్రామం నడిబొడ్డులో ఉన్న మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం పట్ల గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. విగ్రహంపై మడ్డి ఆయిల్ పోయడంతో నల్లగా మారిపోయింది. ఇది జరిగి రెండు రోజులైనట్లు తెలుస్తోంది. మోంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తూ ప్రజలెవరూ బయటకు రాకపోవడంతో గమనించలేదు. శుక్రవారం సాయంత్రం బస్టాండ్ వద్ద కూర్చుని ఉన్న వ్యక్తులు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై వైఎస్సార్ సీపీ నాయకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై రజియా సుల్తానా ఘటన స్థలాన్ని పరిశీలించారు. విగ్రహంపై మడ్డి ఆయిల్ పోసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సైకు ఫిర్యాదు అందజేశారు. అనంతరం మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని శుభ్రంగా కడిగి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు మాదాసు రాంబాబు, సీనియర్ నాయకులు ఉప్పుగుండూరి శ్రీనివాస ప్రసాద్, కొంజేటి సురేష్, పేరాల చెన్నకేశవులు, పాదర్తి శివ, ఇమ్మిశెట్టి బాలకృష్ణ, పక్కెల వజ్రంబాబు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


