కారు ఢీకొని విశ్రాంత ఉద్యోగి దుర్మరణం
ఒంగోలు టౌన్: శుభకార్యానికి ఒంగోలు నగరానికి వచ్చిన ఒక విశ్రాంత ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పోలీసుల కథనం ప్రకారం... తాళ్లూరు మండల కేంద్రానికి చెందిన కర్నాటి వెంకట సుబ్బారెడ్డి (62) శుక్రవారం ఒంగోలు నగరంలో ఒక శుభకార్యానికి వచ్చారు. త్రోవగుంట రోడ్డులోని పాత కల్వరి టెంపుల్ సమీపంలో బృందావన్ ఫంక్షన్ హాలులో నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా, అటుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడు వైద్యారోగ్య శాఖలో మలేరియా విభాగంలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. సీఎస్ పురం మండలం తంబినేనిపల్లి ఆయన స్వగ్రామమైనప్పటికీ ఉద్యోగరీత్యా తాళ్లూరు వచ్చి స్థిరపడ్డారు. గ్రామస్తులందరితో కలిసిపోయే వెంకటరెడ్డి రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. ఆయన మరణవార్త తాళ్లూరులో విషాదాన్ని నింపింది. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆయన మృతికి సంతాపం ప్రకటించింది. సంఘటనపై ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


