తెగిన రాజుచెరువు కట్ట
సింగరాయకొండ: పీబీ స్కీమ్ సప్లయ్ పరిధి సోమరాజుపల్లి పంచాయతీకి చెందిన రాజుచెరువు ఎగువ కట్ట తెగిపోవడంతో చెరువులోని నీరు పల్లాన ఉన్న కొత్త చెరువుకు పరుగులు పెట్టింది. ఈ చెరువు కింద సుమారు 800 ఎకరాల ఆయకట్టు ఉంది. పొలం పనులు ప్రారంభించుకుందామని ఆశించిన ప్రజలకు ఇటీవల కురిసిన వర్షం నిరాశే మిగిలింది. చెరువు కట్ట తెగడంతో నీరు వృథాగా పోయిందని, మళ్లీ చెరువు నిండితే తప్ప పొలం ప్రారంభించే అవకాశం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెరువులో సగానికి నీరు ఉన్నాయని, ఆ నీరు కూడా క్రమంగా పల్లానికి పారుతున్నాయని, దీంతో చెరువు 80 శాతం ఖాళీ అయ్యే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట తెగడంతో నీరు ఉధృతంగా పారి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ కోతకు గురైంది. ట్రాక్ కోతకు గురికాకుండా రైల్వే అధికారులు ముందు జాగ్రత్తగా ట్రాక్ వెంబడి ఇసుక బస్తాలు వేసుకున్నారు. రాజుచెరువు కట్ట తెగడంతో చెరువును వైఎస్సార్ సీపీ పాకల గ్రామ నాయకులు కేశవరపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ గోళ్లమూడి అశోక్‌రెడ్డి, మరి కొందరు రైతులు పరిశీలించారు. చెరువులో మిగిలిన నీరు కూడా పోకుండా చెరువు కట్టకు ఇసుక బస్తాలు వేసి నీటిని రక్షించాలని ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాజుచెరువు కట్టకు ఇసుక బస్తాలు వేసి మిగిలిన నీటిని కాపాడాలని ఒంగోలు ఆర్‌డీఓ లక్ష్మీప్రసన్నకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విజ్ఙప్తి చేశారు.
కోతకు గురైన రైల్వేట్రాక్


