
టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
● పోలీసుల రాజీ యత్నం
సింగరాయకొండ: వినాయక విగ్రహం వద్ద ప్రసాదం విషయంలో టీడీపీ, బీజేపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని కలియవాడ గ్రామం చాకలిపాలెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..బీజేపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కళ్లగుంట సురేష్‌కు, టీడీపీ సానుభూతిపరుడు కె. రవికి మధ్య చాకలిపాలెంలో వినాయక విగ్రహం వద్ద శనివారం రాత్రి గొడవ జరిగి ఇద్దరు ఘర్షణ పడ్డారు. తరువాత అందరూ ఇళ్లకు వెళ్లిన తరువాత సురేష్ టంగుటూరు మండలం నిడమానూరు గ్రామం నుంచి సుమారు 11 మందిని తీసుకువచ్చి లైట్లు ఆర్పీ చీకట్లోనే అక్కడే ఉన్న వారిపై కర్రలతో దాడి చేశారు. దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో చాకలిపాలెం వాసులు 30 మంది పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బీజేపీ నాయకుడు సురేష్‌పై ఫిర్యాదు చేశారు. ఈ లోగా సురేష్..తన పరపతిని ఉపయోగించి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం దాడి చేసుకున్న వారు ఇద్దరూ బంధువులై ఉండి మా గ్రామంలోకి పక్క గ్రామానికి చెందిన వారిని తీసుకువచ్చి దాడి చేయడం ఏంటని, ఈ ఘటనపై కేసు నమోదు చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో పోలీసులు రాజీ చేస్తారా లేక కేసు కట్టి న్యాయాన్ని కాపాడతారా వేచి చూడాల్సి ఉంది. పోలీసులు మాత్రం కూటమి ప్రభుత్వంలోని పార్టీల నాయకులు కావటంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. వినాయక విగ్రహాల నేపథ్యంలో మూలగుంటపాడు, పాతసింగరాయకొండ పంచాయతీ గుజ్జుల యలమందారెడ్డి నగర్ మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలకు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.