
నేర నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలి
కనిగిరిరూరల్: నేరాల నియంత్రణకు సాంకేతికతను ఉపయోగించుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికత పాత్ర కీలకమన్నారు. స్థానిక పవిత్ర కల్యాణ మండపంలో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలన్నారు. పెండింగ్ కేసులను తగ్గించేందుకు అన్నిస్థాయిలోని అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపర చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు. డ్రోన్, సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధన వేగవంతం చేయాలన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్స్, ఈవ్‌టీజింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ఏరియాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఇతర నేరాలు జరిగే ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలను ముందుగానే గుర్తించి ఆ ప్రాంతాలకు డ్రోన్లు పంపి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగించాలని సూచించారు.
కేసుల పురోగతిపై సమీక్ష..
ఈ సందర్భంగా హత్య కేసులు, లైంగిక దాడులు, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, పెండింగ్ కేసులపై ఎస్పీ సమీక్షించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా కేసుల పరోగతిపై సమీక్షించారు. జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, చెడు నడత కల్గిన వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి సమీక్షించారు. ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు.
ప్రతిభ కనబర్చిన అధికారులకు అభినందన
ఈ నెల 12న కొండపి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును త్వరగా ఛేదించి రూ.15 లక్షల విలువైన సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబర్చిన సీఐ, ఎస్సై, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలను, రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అత్యాధునిక సాంకేతికత కల్గిన డ్రోన్ కెమెరాలను ఎస్పీకి అందచేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరావు, డీఎస్పీలు ఆర్ శ్రీనివాసరావు, లక్ష్మీ నారాయణ, సాయి ఈశ్వర్ యశ్వంత్, రమణ కుమార్, డీసీఆర్‌బీ సీఐ దేవప్రభాకర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు సాంకేతికతను అందిపుచ్చుకోండి పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించండి నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్

నేర నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలి