
శివకేశవ ఆలయాల మధ్య అడ్డుగోడ
● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు, గ్రామస్తులు
పొన్నలూరు: స్థానిక శివాలయం, చెన్నకేశవ ఆలయాల మధ్య కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రహరీ నిర్మాణం వివాదానికి దారితీస్తోంది. రెండు ఆలయాల మధ్య శాస్త్ర విరుద్ధంగా కొందరు కావాలనే గోడను నిర్మించడంపై భక్తులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొన్నలూరు గ్రామంలో దశాబ్ధ కాలం నుంచి దక్షిణముఖ శివాలయం, చెన్నకేశవ ఆలయాలు ఉండటం చాలా అరుదుగా చెప్పుకుంటారు. ఈ రెండు దేవాలయాల్లో భక్తులు పూజలు చేస్తుంటారు. శివాలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండగా, చెన్నకేశవ స్వామి ఆలయ నిర్వాహణ బాధ్యతలను ధర్మకర్తలు చూస్తున్నారు. అయితే శాస్త్ర విరుద్ధంగా మూడు రోజుల క్రితం రెండు ఆలయాల మధ్య ప్రహరీ నిర్మించడం పట్ల భక్తులు, గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు, దేవాదాయ శాఖ అధికారులకు తెలియకుండా చెన్నకేశస్వామి ఆలయ ధర్మకర్తలే ఈ పనికి పూనుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శివాలయం వెనుక వైపు కనీసం భక్తులు ప్రదక్షణలు చేయడానికి కూడా వీలు లేకుండా గోడ నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ఈఏపీసెట్‌కు 2271 మంది హాజరు
ఒంగోలు సిటీ: జేఎన్‌టీయూ కాకినాడలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్ష జరగనుంది. జిల్లాలో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించి మొత్తం 2357 మందికి గాను 2271 మంది హజరయ్యారు. 96.35 శాతం మంది ప్రవేశపరీక్షకు హజరయ్యారు.
ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలి
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
టంగుటూరు: హౌసింగ్ లే అవుట్‌లో ఇళ్ల నిర్మాణాలు ప్రతి ఒక్కరూ వెంంటనే ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. మండలంలోని జమ్ములపాలెం హౌసింగ్ లే అవుట్‌ని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ హౌసింగ్ లే అవుట్‌లో ఎన్ని ప్లాట్లు ఇచ్చారు, ఎంత మంది నిర్మాణాలు చేపట్టారని వివరాలు అడిగి తీసుకున్నారు. ఇళ్ల పట్టాల లబ్ధిధారుల రీ వెరిఫికేషన్ చేసి అర్హులను గుర్తించాలన్నారు. అర్హులంతా త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్‌ఐ హనుమంతరావు, వీఆర్‌ఓ లక్ష్మి, ఇంజినీరింగ్ అసిస్టెంట్ శరత్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.