
క్రమశిక్షణ పాటించకుంటే కఠిన చర్యలు
ఒంగోలు సబర్బన్: సచివాలయ సిబ్బంది క్రమశిక్షణ పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. ఒంగోలు శివారులోని కొప్పోలు వార్డు సచివాలయాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా స్థానికులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రీసర్వే డేటాను పరిశీలించారు. ఆధార్ కార్డ్ లేని చిన్నారులు సచివాలయం పరిధిలో ఎంత మంది ఉన్నారు...వారికి ఆధార్ కార్డులు అందేలా ఎలాంటి చర్యలు తీసుకున్నారని మహిళా సంరక్షణ కార్యదర్శిని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది వేస్తున్న బయోమెట్రిక్ హాజరు వివరాలను పరిశీలించారు. కొందరు సిబ్బంది 11 గంటలకు వచ్చినట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన, సేవల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సచివాలయ పరిధిలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నతో కలిసి నగరంలో ఇంటి పట్టాలకు సంబంధించి రీ వెరిఫికేషన్ చేశారు. ఇంటి నివేశన పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆధార్ కార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పిన్నిక మధుసూదన్‌రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఉన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా కొప్పోలు వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ