
ఆశావహులు రగిలి!
ఆశలు నీరుగారి..
అధికార కూటమిలో నామినేటెడ్‌పదవుల కాక ఓ రేంజ్‌లో సాగుతోంది. పైకి అంతా బాగానే ఉందని ఆ పార్టీ నేతలు
చెబుతున్నా.. అంతర్గతంగా మూడు పార్టీల నేతలు రగిలిపోతున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీ కోసం పనిచేసిన వారికి పదవులు దక్కడం లేదని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేనకు మొక్కుబడిగా ఒక పదవి దక్కగా, కమలనాథులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తిని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదేం మిత్ర ధర్మమంటూ మండిపడుతున్నారు. ఆదివారం ప్రకటించిన నామినేటెడ్ పదవులు కూటమికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయన్న ప్రచారం జరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
విడతలవారీగా భర్తీ అవుతున్న నామినేటెడ్ పదవులపై అధికార కూటమిలో ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పదవులను భర్తీ చేస్తారని అంతా భావించారు. 10 నెలలు గడుస్తున్నా అప్పుడో పదవి, ఇప్పుడో పదవి అంటూ ప్రకటిస్తుండటంతో టీడీపీ నేతలు అసహనానికి గురవుతున్నారు. గత ఎన్నికల సమయంలో పదవుల ఆశ పెట్టి కొంతమంది నాయకులను బాగానే వాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలైపోయాక వారికి ఒట్టి చేతులు చూపడంతో అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నట్లు సమాచారం. జిల్లాకు సంబంధించి ఇంకా కీలక పదవుల భర్తీ పెండింగ్‌లో ఉండటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
వీరివీరి గుమ్మడిపండు..
ఒడా పదవి ఎవరికి...
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జిల్లా నాయకులంతా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఒడా) చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీడీపీ నాయకులు అరడజను మందితోపాటు జనసేన నాయకులు కూడా ఈ పదవి కోసం పోటీపడ్డారు. టీడీపీలోని కీలకమైన మహిళా నాయకురాలు కూడా ఈ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ పదవిని జనసేన నాయకులకు ఇచ్చేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పదవిని ఓ మాజీ ఎమ్మెల్యేకు ఇచ్చేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు అతని పేరు ఖరారయ్యే సమయంలో సదరు నాయకురాలు తనకు సన్నిహితంగా ఉండే మంత్రి ద్వారా దాదాపు అడ్డుకున్నట్టు తెలిసింది. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రయత్నించిన నాయకులు తగిన గుర్తింపులేదని పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
పీడీసీసీ పదవిపై అసంతృప్తి..
పీడీసీసీ పదవికి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పేరు ప్రకటించడంతో టీడీపీలో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పదవి కోసం పచ్చ తమ్ముళ్ల మధ్య పోటాపోటీ నెలకొనడంతో ప్రకటించకుండా పెండింగ్‌లో పెడుతూ వచ్చారు. ఇటీవల హత్యకు గురైన వీరయ్య చౌదరి పోటీ పడినట్లు ప్రచారం. పార్టీ అధిష్టానం వీరయ్య పేరును ఖరారు చేసిందని, అయితే ఊహించని విధంగా వీరయ్య దారుణ హత్యకు గురవడంతో కామేపల్లికి లైన్ క్లియర్ అయినట్లు చెప్పుకుంటున్నారు. ఈ పదవి కోసం దర్శి నియోజకవర్గం నుంచి కూడా ఓ నేత తీవ్రంగా ప్రయత్నించారు. సదరు నాయకుడికి మద్దతుగా జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి దగ్గర నుంచి సిఫార్సు లేఖలు ఇచ్చినట్లు తెలిసింది. ఇతర నియోజకవర్గాల నుంచి సైతం నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ పదవి దక్కకపోవడంతో తమకు మొండిచేయి చూపించారని మండిపడుతున్నట్టు సమాచారం. కీలకమైన పదవులను ఒకే సామాజికవర్గానికి మాత్రమే కట్టబెడుతున్నారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు.
జనసేన గ్రూపుల్లో రాజుకున్న అసంతృప్తి...
జిల్లా జనసేనలో మొదట్నుంచి రెండు గ్రూపులున్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌కు ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ పదవి ఇవ్వడంతో జనసేనలోని ప్రత్యర్థి గ్రూపులు మండిపడుతున్నట్లు సమాచారం. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.
రగిలిపోతున్న ఇతర సామాజిక వర్గాలు...
టీడీపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కంభం మార్కెట్ యార్డు పదవి, సహకార బ్యాంకు పదవులను ముస్లింలకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ముస్లింలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు. జిల్లాలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, హజ్ కమిటీలను కూడా భర్తీ చేయకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవిని కుప్పం ప్రసాద్‌కు ఇచ్చారు. ఈ పదవిపై పొదిలికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడైన గుణిపూడి భాస్కర్ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయనను పూర్తిగా పక్కన పెట్టారు. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మార్కాపురానికి చెందిన ఓ నాయకుడికి కూడా ఎలాంటి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. పార్టీలో సీనియర్లకు విలువలేదని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులం, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అధికార కూటమిలో నామినేటెడ్ సెగలు పది నెలలుగా పదవులపై ఆశలు ఇంకా పెండింగ్‌లో కీలక పదవులు ఒడా చైర్మన్‌పై పంతాలకు పోతున్న నాయకులు స్థానికంగా సంబంధాలు లేనివారికి పదవులు మరింత చిచ్చురాజేసిన జనసేన బీజేపీలోనూ వినిపిస్తున్న అసంతృప్తి రాగాలు
ఒకరు విజయవాడ.. మరొకరు హైదరాబాద్...
తొలివిడత నామినేటెడ్ పదవుల పందేరంలో బీజేపీకి చెందిన లంకా దినకర్‌కు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌గా ఇచ్చారు. ఒంగోలుకు చెందిన ఆయన విజయవాడకు మకాం మార్చి చాలా రోజులైంది. అలాగే అవినీతి కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ ఐటీ ఉద్యోగులతో సమ్మెలు చేయించినందుకుగానూ భూమి ఫౌండేషన్ నిర్వాహకురాలు పొడపాటి తేజస్వీకి సాంస్కృతిక విభాగం చైర్‌పర్సన్ పదవి ఇవ్వడం టీడీపీలో చర్చనీయాంశమైంది. తేజస్వీ ఒంగోలు వాసే అయినప్పటికీ ఎప్పటి నుంచో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి తొలివిడతలోనే పదవులు దక్కాయి. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రం మొండిచేయి చూపారని తమ్ముళ్లు గరం గరంగా ఉన్నారు. అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని కమలనాథులు కుమిలిపోతున్నారు. జిల్లా కోటా నుంచి లంకా దినకర్‌కు పదవి ఇచ్చినప్పటికీ ఆయనకు స్థానిక బీజేపీతో ఎలాంటి అనుబంధంగానీ సంబంధంగానీ లేదని చెబుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో తమను పరిగణనలోకి తీసుకోవడం లేదని కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.